కలెక్టరేట్ ముట్టడి

15 Sep, 2015 04:38 IST|Sakshi
కలెక్టరేట్ ముట్టడి

కలెక్టరేట్ వద్ద మూడంచెల భద్రత
నాయకులు, పోలీసులకు తోపులాట
భారీగా పోలీసుల మొహరింపు
 బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సహా నాయకుల అరెస్టు పూచీకత్తుపై విడుదల

 
 హన్మకొండ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ సోమవారం చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తల తోపులాట, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం, పోలీసులు కార్యకర్తలను           నెట్టి వేయడం ఉద్రిక్తతకుదారి తీశాయి. సోమవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చే స్తూ, బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగుర వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ర్యాలీని కలెక్టర్ బంగ్లా వద్దకు చేరుకోగానే అప్పటికే ఏర్పాటు చేసిన, రో ప్ పార్టీతో అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిం చారు. అయితే పోలీసు వలయాన్ని ఛేదించుకుని పారీ కార్యకర్తలు కలెక్టరేట్ వైపునకు పరుగులు తీశారు. పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసి వేశారు. బారీకేడ్లు అడ్డంగా పెట్టారు.

ముళ్ల కంచే ఏర్పాటు చేసి మూడంచెల భద్రత కల్పించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చింత సాంబమూర్తి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు.
 
ముళ్ల కంచెను ఛేదించుకుని..

 ముళ్లకంచెను దాటి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు శ్రమించారు. ఓ కార్యకర్తల రోప్‌పార్టీని తప్పించుకుని రాగా పోలీసులు అడ్డుకోవడంతో ముళ్లకంచెలో పడ్డారు. బీజేపీ గిరిజన మోర్చ నాయకుడు లక్ష్మణ్‌నాయక్ కలెక్టరేట్‌లోకి చేరుకుని చేతులతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వెంటనే లక్ష్మణ్‌నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభ పక్ష ఉపనేత ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యక్తలు పోలీసు వాహనానికి అడ్డంగా పడుకున్నారు. పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ తరలించగా మహిళ నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు. మహిళ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు మందాడి సత్యనారాయణరెడ్డి, ఒంటేరు జయపాల్, దిలీప్ నాయక్, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణరావు, కొత్త దశరథం, మల్లాడి తిరుపతిరెడ్డి, గాదె రాంబాబు, బండి సాంబయ్య, జలగం రంజిత్, దొంతి దేవేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, జన్నె మొగిలి, తాళ్ళపల్లి కుమారస్వామి, పోతుగంటి రామదాస్, రావు అమరేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, సురేష్, రాజేందర్ పాల్గొన్నారు.

ఆత్మలు ఘోషిస్తున్నాయి : జి.కిషన్‌రెడ్డి
 టీఆర్‌ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో నైజాం పాలనకు, రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో అనేక మాటలు మాట్లాడిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట మర్చారని దుయ్యబట్టారు. రజాకార్ల వారుసులు మజ్లిస్ పార్టీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని తూర్పారబటారు. మెడకాయ మీద తల ఉన్నంత సేపు ఇచ్చిన మాట తప్పనని చె ప్పిన సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఒక వర్గం వారికి బాధకలుకుతుందని చెపుతున్న కేసీఆర్.. నిజాం వారసులకు తెలంగాణను అప్పగిస్తారా అని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్ వైఖరి చూసి నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లా ఖాన్, తురేభాఖాన్, భూపతి కృష్ణమూర్తి వంటి పోరాట యోధులను అవమానపరిచేల ఉందన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ పిడికిలి ఎత్తి పోరాటం చేస్తుందన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు