పార్కింగ్‌ వసూళ్లు.. హైకోర్టు నోటీసులు

4 Apr, 2018 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యాపార కూడళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ ఫీజు వసూళ్లను ఎందుకు నివారించలేకపోతున్నారో వివరణ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ అపార్ట్‌మెంట్స్‌ యాక్ట్‌లోని 31వ సెక్షన్‌ను ఉల్లంఘిస్తూ వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్‌ చేసినందుకు ఫీజు వసూలు చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఎం.ఇంద్రసేనచౌదరి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ అందులో పేర్కొన్నారు.

దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పార్కింగ్‌ ఫీ వసూళ్లను ఎందుకు నిలువరించలేకపోతున్నారో కౌంటర్‌ పిటిషన్ల ద్వారా తెలపాలంటూ రెండు రాష్ట్రాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బాలాజీ వాదించబోతుండగా ధర్మాసనం కల్పించుకుని.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పార్కింగ్‌ ఫీ వసూళ్లను రద్దు చేసినట్లుందని గుర్తు చేసింది. పార్కింగ్‌ ఫీజు రద్దు చేసినట్లు ప్రకటించినా.. యథావిధిగానే వసూళ్లకు పాల్పడుతున్నారని న్యాయవాది బదులిచ్చారు. ఏపీ ప్రభుత్వంలో అసలు పార్కింగ్‌ ఫీజు రద్దుపై ఏ చర్యలు లేవన్నారు. కొన్ని వ్యాపార భవన సముదాయాలనే ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అధికారులకు నోటీసులు ఇచ్చి వివరాలు తెప్పించుకుంటామని స్పష్టం చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు