ఐటీ చెల్లింపుదారుల వివరాల సేకరణ

13 Feb, 2019 02:57 IST|Sakshi

ఆదాయపు పన్ను శాఖకు పార్థసారథి లేఖ

పీఎం–కిసాన్‌ రాష్ట్ర నోడల్‌ అధికారిగా రాహుల్‌ బొజ్జా

చిన్న,సన్నకారు రైతుల్లో సగం మందికే అర్హత  

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయపు పన్ను కట్టే వారందరి వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ బిస్వనాథ్‌ ఝాను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌) పథకానికి విధించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఐదెకరాలకు కుటుంబం యూనిట్‌గా తీసుకుంటుండటంతో పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్‌ కార్డుల జాబితా ఆధారంగా లబ్ధిదారులను వడపోస్తుండగా, ఆదాయపు పన్ను కట్టే వారి వివరాలను కూడా సేకరించే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. రూ.10 వేల పింఛన్‌ తీసుకునే వారి వివరాలను కూడా తీసుకుంది. రాష్ట్రంలో 5 ఎకరాలలోపు 47.28 లక్షల మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. అయితే కేంద్రం విధించిన నిబంధనల కారణంగా ఇందులో సగం మంది మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఐటీ చెల్లించే వారిని, రూ.10 వేలు పింఛన్‌ తీసుకునే వారిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. కుటుంబం యూనిట్‌గా తీసుకుంటున్న కారణంగా ఐదెకరాలలోపు ఉన్నవారిలో 30 శాతం అనర్హులు అవుతారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వడపోతల అనంతరం వచ్చిన వివరాలను ఈనెల 25 నాటికి పీఎం–కిసాన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. ఒకవేళ ఈనెల 25 నాటికి అర్హులైన రైతులందరి జాబితాను అప్‌లోడ్‌ చేయకపోయినా, వివరాలు పంపించిన ఏడాదిలోపు ఎప్పుడైనా సొమ్ము రైతుల ఖాతాలో వేస్తారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలుకు సంబంధించి కసరత్తుపై కేంద్ర వ్యవసాయశాఖ మంగళవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను రూపొందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇదిలావుండగా పీఎం కిసాన్‌ పథకం అమలుకు అన్ని రాష్ట్రాలలో నోడల్‌ శాఖను, అధికారిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిగా నియమించింది. 

‘రైతుబంధు’పై విషప్రచారం: పార్థసారథి 
తెలంగాణలో రైతుబంధు తాత్కాలికం అంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేసినట్లుగా కొన్ని సంస్థలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్‌ మొద టి ప్రాధాన్యం రైతులను ఆదుకోవడమేనన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రైతు లకు అండగా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రైతుబంధు దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, ఇలాంటి పథకం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు తెలంగాణని రోల్‌ మోడల్‌గా చూస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, సోషల్‌ మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.  

మరిన్ని వార్తలు