కాటారంలో 'మావో' కరపత్రాల కలకలం

16 Oct, 2019 10:19 IST|Sakshi

సాక్షి, కాటారం(వరంగల్‌) : కాటారం సబ్‌ డివిజన్‌లోని పలు మండలాల్లో కొన్ని రోజులుగా కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పలిమెల మండలంలోని సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్‌లో పలువురు ప్రజాప్రజాప్రతినిధులు, నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రాలు వేయగా తాజాగా మంగళవారం కాటారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) పేరిట కరపత్రాలు వెలిశాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాల గేటుతో పాటు కాటారంలోని పలు ఇళ్ల గోడలపై మావోల పేరిట రాసిన కరపత్రాలు దర్శనమిచ్చాయి. కాటారం మండల కేంద్రానికి చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్‌ నాయకులు బొమ్మ మల్లారెడ్డిని టార్గెట్‌ చేస్తూ కరపత్రాలు వెలిసాయి.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చైర్మన్‌ పదవిని అడ్డుపెట్టుకుని మేడారం, తాడ్వాయి మండలంలో 150 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడటంతో పాటు ముకునూరు, నీలంపల్లిలో 430 ఎకరాల భూమి అక్రమంగా స్వాధీనపర్చుకున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ భూములను ప్రజలకు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆయనతో పాటు కుటుంబసభ్యులను కాల్చి చంపుతామని కరపత్రాల ద్వారా హెచ్చరించారు. కాగా, కరపత్రాల్లో భారతకమ్యూనిస్టూ పార్టీ (మావోయిస్టు) అనేది మాత్రమే ఎరుపు రంగు పెన్నుతో రాసి మిగితా లేఖ మొత్తం బ్లూ పెన్నుతో రాయడంతో ఇవి నకిలీ కరపత్రాలనే సందేహాలు వెలువడుతున్నాయి.

మల్లారెడ్డితో వైరం ఉన్నవారు ఎవరో భయభ్రాంతులకు గురి చేయడానికి నకిలీ కరపత్రాలు సృష్టించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కరపత్రాల్లో పేర్కొన్నట్లు మల్లారెడ్డికి భూములు లేనట్లు సమాచారం. కాగా, సమాచారం తెలుసుకున్న సీఐ హతీరాం, ఎస్సై2 జహీర్‌ఖాన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనపర్చుకున్నారు. ఈ విషయమై సీఐ హతీరాంను వివరణ కోరగా అవి నకిలీ కరపత్రాలని కొట్టిపారేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా