పకడ్బందీగా ఓటరు సవరణ

14 Aug, 2019 08:17 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళీకేరి

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఇంటింటా ఓటరు సర్వే, జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ భారతి హోళీకేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు, సవరణ చేపడతామని, సెప్టెంబర్‌ ఒకటి నుంచి 30 వరకు బీఎల్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల బూత్‌లెవల్‌ నాయకుల సహాయంతో ఇంటింటా పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుందని, ఇందులో స్థానికంగా ఉంటున్న వారు, ఇతర వార్డులో ఉన్నవారు, చనిపోయిన, ఓటరు జాబితాల్లో తప్పిదాలను సవరిస్తామని తెలిపారు.

2020 జనవరి ఒకటివరకు 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు స్వీకరణ అక్టోబర్‌ 15 నుంచి 30వరకు ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలో ఎక్కడైనా 1500 ఓటర్ల లోపు ఉండాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి జియోట్యాగింగ్‌ ఉంటుందని, ఆన్‌లైన్, మీసేవ, నేరుగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జాబితాలో వివరాలు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ 1950 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. 

భూ సమస్యలకు రెవెన్యూ అధికారులు బాధ్యులు కారు
జిల్లాలో నెలకొన్న వివిధ భూ సమస్యలపై గ్రామసభల ద్వారా  రైతుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు రికార్డులు వారి ముందు ఉంచుతామన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, ఫారెస్ట్, వారసత్వంగా వచ్చినవి, తదితర భూముల సమస్యలు నెలకొన్నాయని, ఇందులో రెవెన్యూ అధికారులు పరిష్కరించేవి కొన్నిఉంటే, సివిల్‌కోర్టు, రిజిస్ట్రేషన్‌ పరిధిలో ఉన్నాయన్నారు. భూ సమస్యలకు రెవెన్యూ అధికారులది బాధ్యత కాదని పేర్కొన్నారు.

మే నెలలో మండల స్థాయిలో నిర్వహించిన భూ సమస్యల పరిష్కార వేదికలో 16వేల వరకు అర్జీలు రాగా అందులో 4 వేల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. కొన్ని సివిల్‌ తగాదాలు, కోర్టు పరిధిలోనివి.. తాతలు, తండ్రుల నుంచి వస్తున్న భూములు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నా..  కాస్తులో వారిపేరు, ఇతర రికార్డులు వారివద్ద ఉంటే చూపించాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డులో ఉన్న వాటిని పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

వారసత్వ పంపకాలకు సరిహద్దులు చూపించడం కుదురదని, సర్వేనంబర్ల ఆధారంగా హద్దులు చెబుతామని తెలిపారు. కుటుంబంలో పెద్దకుమారుడికి భూమి మొత్తం ఇచ్చి.. ఇప్పుడు అన్నదమ్ములకు సమానంగా ఇవ్వాలని ఫిర్యాదు చేయడం సరికాదని, అలాంటివాటిని సబ్‌కలెక్టర్, సివిల్‌కోర్టులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివి సత్వరమే పరిష్కారం కావని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కూమర్‌ దీపక్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు