అధికారిక భవనం లేక.. అతిథిలా..!

26 Jul, 2014 00:36 IST|Sakshi
అధికారిక భవనం లేక.. అతిథిలా..!

క్యాంపు కార్యాలయం ఖాళీ లేక కలెక్టర్‌కు ఇబ్బందులు
నెల రోజులుగా గెస్ట్‌హౌస్‌లోనే బస
అధికారిక నివాసం ఖాళీ చేయని అహ్మద్‌బాబు
 ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం.. అబ్బో ఎన్ని హంగులు.. మరెన్ని సౌకర్యాలో.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడడంలేదు. దానికీ కారణం లేకపోలేదు.. మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడమే..! కొత్త కలెక్టర్ ఎం.జగన్మోహన్ బసచేస్తున్న అతిథిగృహం వద్ద కనీస సౌకర్యాలు లేక ఆయన్ను కలిసేందుకు వస్తున్న ప్రజలు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అంతటి వర్షంలోనూ తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారూ వర్షంలోనే వేచి చూడాల్సి వస్తోంది. ఈ బాధ ప్రజలకే కాకుండా అధికారులకూ తప్పడం లేదు.

వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు అతిథిగృహం ఆవరణలోనే పడిగాపులు కాయాల్సి వస్తోం ది. ఇక్కడ మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు జూన్ 26న బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని జలమండలి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన స్థానంలో జగన్మోహన్ జూన్ 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బదిలీ అయిన కలెక్టర్ అహ్మద్‌బాబు క్యాంపు కార్యాలయా న్ని ఖాళీ చేయలేదు. దీంతో కొత్త కలెక్టర్ టీటీడీసీ (సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) అతిథిగృహంలో బస చేయాల్సి వస్తోంది.

ఇందులో కనీసం పది మంది కూడా నిలబడేందుకు స్థలం కూడా లేదు. వేచి చూడడానికి వెయిటింగ్ హాల్ కూడా లేదు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా శాఖల సమీక్ష సమావేశాలు కలెక్టర్ అధికారిక నివాసంలో నిర్వహిస్తున్న సమయంలో అధికారులు గంటల కొద్దీ బయటే ఉండాల్సి వస్తోంది. అందుబాటులో మంచినీటి సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వ అధికారిక బంగ్లా (క్యాంప్ కార్యాలయం)లో పాత కలెక్టర్ అహ్మద్‌బాబు ఇంటి సామగ్రి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుండటంతో ప్రస్తుత కలెక్టర్ అతిథిగృహంలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది.

>
మరిన్ని వార్తలు