కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం 

22 Oct, 2019 08:04 IST|Sakshi

సింగిల్‌ యూస్‌డ్‌   ప్లాస్టిక్‌ పై నిషేధం

స్వచ్ఛ పెద్దపల్లి సాధనకు సహకరించాలి

కలెక్టర్‌ శ్రీదేవసేన 

సాక్షి, పెద్దపల్లి : ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు కేజీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకుని కిలో బియ్యం అందించేందుకు రైస్‌మిల్లర్లు సహకరించాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సూచించారు. పర్యావరణానికి, భూగర్భ జలాల పెంపునకు ఆటంకం కలిగించే సింగిల్‌ యూస్డ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘మా గృహం స్వచ్ఛ గృహం, ప్లాస్టిక్‌ నిర్మూలన అంశాలపై జిల్లా రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌ బంక్‌ డీలర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని స్వశక్తి మహిళలకు ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతోపాటు అవసరమైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛతలో ఉత్తమ జిల్లాగా కీర్తి గడిచిన పెద్దపల్లిని అదేస్థాయిలో నిలిపేందుకు రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంక్‌ డీలర్లు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకుని కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం అందించాలని కలెక్టర్‌ కోరగా రైస్‌మిల్లర్ల ప్రతినిధులు అందుకు అంగీకరించారు. అనంతరం జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకవచ్చిన జిల్లా కలెక్టర్‌ను రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంకుల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా ఫౌరసరఫరాల అధికారి వెంకటేశ్, సివిల్‌సప్‌లై జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు