‘రుణమాఫీ’.. ఖాతాలో జమ చేయాలి

21 May, 2020 11:10 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీదేవసేన

ఇప్పటి వరకు 2,940 మంది రైతులకు జమ

కలెక్టర్‌ శ్రీదేవసేన

నేడు సీఎంతో కలెక్టర్ల సమావేశం

ఆదిలాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా పలు అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకు రుణం తీసుకున్న ప్రతీ రైతుకు పంట రుణమాఫీ కింద రూ.25 వేలు ఖాతాలో జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు 2,940 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. సుమారు రూ.4.70 కోట్లు రైతులకు చేరాయని, మిగతా రైతులకు త్వరలో జమ చేయాలన్నారు. ఈ డబ్బులను రైతులు వ్యవసాయ పనులకు వినియోగించుకోవడం జరుగుతుందని, ఈ డబ్బును ఎలాంటి రికవరీ కింద జమచేయకూడదని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈజీఎస్‌ పథకం కింద జిల్లాలో లక్ష 60 వేల వరకు జాబ్‌కార్డులు ఉన్నాయని, రోజుకు 92వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని పేర్కొన్నారు.

బేల మండలం మంగ్రూడ్‌ గ్రామంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ కోసం 200 ఎకరాలను గుర్తించామన్నారు. పట్టణంలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించాలని, పట్టణాభివృద్ధికి, సుందరీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలు, ఇతర అవసరమైన పనులకు కావాల్సిన భూమిని సేకరించాలన్నారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కొనసాగించాలన్నారు. నీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలని, హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్, డీఆర్వో నటరాజ్, ఆర్డీవోలు సూర్యనారాయణ, వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో కిషన్, డీఆర్డీవో రాజేశ్వర్, ఎల్డీఎం చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు