ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

14 Apr, 2018 13:28 IST|Sakshi
పీహెచ్‌సీలో ఫర్నిచర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ముండ్రాతి హరిత

నల్లబెల్లి(నర్సంపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీతోపాటు, కస్తూరిబాగాంధీ బాలికల గురుకుల విద్యాలయం, మామిండ్లవీరయ్యపల్లి నర్సరీలను ఆమె శుక్రవారం సందర్శించారు. పీహెచ్‌సీలో మేడిసిన్‌ స్టాక్‌ రూం, ప్రసవాల గదిని పరిశీలించారు. పనికిరాని వస్తువులు ఆస్పత్రిలోపల ఎందుకు ఉంచారని సిబ్బందిని మందలించారు. ధ్వసమైన కాంపౌండ్‌ వాల్‌కు మరమ్మతు చేయించే విషయమై స్థానిక సర్పంచ్‌ కొత్తపల్లి కోటిలింగాచారితో చర్చించారు. ఆస్పత్రి ఆవరణలోని మొక్కలకు నీళ్లుపోశారు.

ఈ సందర్భంగా మరుగుదొడ్లు నిర్మించుకొని నాలుగు నెలలు కావస్తున్నా అధికారులు బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ జిల్లా నాయకుడు తడుక అశోక్‌గౌడ్, కాంగ్రెస్‌ నాయకుడు నాగంపెల్లి వీరన్న కలెక్టర్‌ దృష్టికి తీసువెళ్లగా త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కస్తూరిబా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. మూడేళ్లుగా నిర్మించిన మరుగుదొడ్ల బిల్లు చెల్లించడంలో ఇంజనీరింగ్‌ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంఈఓ మాలోత్‌ దేవా కలెక్టర్‌ దృష్టికి తీసువెళ్లగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామిండ్లవీరయ్యపల్లి నర్సరీని సందర్శించిన కలెక్టర్‌ హరితహారం లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులు పనిచేయాలని సూచిం చారు. మండల ప్రత్యేకాధికారి పురుషోత్తం, తాహసీల్దార్‌ రాజేంద్రనాద్, ఇన్‌చా ర్జి ఎంపీడీఓ బాబు, ఎంఈఓ దేవా, నల్లబెల్లి వైద్యాధికారి మమేందర్‌నాయక్, కస్తూరిబాగాంధీ ఎస్‌ఓ సునీత, సర్పంచ్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు