చెరువులను పరిశీలించిన కలెక్టర్‌

21 Apr, 2018 11:54 IST|Sakshi

చందం, మల్లం చెరువు పనులపై అసంతృప్తి

‘కాకతీయ’ పనులు వేగవంతం చేయాలని

ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశం

సాక్షి, మెదక్‌: మిషన్‌ కాకతీయ చెరువుల పూడికతీత పనులు నత్తనడకన సాగడంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్‌ కె.ధర్మారెడ్డి స్పందించారు. శుక్రవారం మెదక్‌ మండలం, పట్టణంలోని చెరువులను ఆయన పరిశీలించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయ మూడవ, నాల్గవ విడత చెరువుల పూడికతీత పనుల జాప్యంపై ‘నత్తనడక’ శీర్షికతో ‘సాక్షి’ శుక్రవారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ మెదక్‌ మండలం మద్దులవాయి గ్రామంలోని చందం చెరువును పరిశీలించారు. మూడవ విడత మిషన్‌ కాకతీయలో భాగంగా చందం చెరువు పూడికతీత ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి పనుల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడికతీత, చెరువు కట్టతోపాటు ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య, ఇతర అధికారులను ఆదేశించారు.

మెదక్‌ పట్టణంలోని మద్దులవాయి చెరువును కలెక్టర్‌ పరిశీలించారు. మిషన్‌ కాకతీయ కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. తూము అభివృద్ధి, బతుకమ్మ ఘాట్‌ నిర్మాణం పనులను కలెక్టర్‌ పరిశీలించారు. రూ.72.98 లక్షలతో మిషన్‌ కాకతీయ కింద మల్లం చెరువు పూడికతీత ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య కలెక్టర్‌కు వివరించారు. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్బంగా మల్లం చెరువు శిఖం ఆక్రమణకు గురికావడాన్ని గుర్తించిన కలెక్టర్‌ వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యను ఆదేశించారు. మల్లం చెరువు శిఖంలో కొత్తగా కడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలన్నారు. ఇకపై చెరువు ఆక్రమణకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తహసీల్దార్‌ యాదగిరికి సూచించారు. మెదక్‌ పట్టణంతోపాటు జిల్లాలోని పలు చెరువుల శిఖం భూములు అన్యాక్రాంతానికి గురికావడం, శిఖంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంపైనా గతంలో ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది.

మరిన్ని వార్తలు