ముందు జిల్లాలే..

21 Jun, 2016 01:08 IST|Sakshi
ముందు జిల్లాలే..

 కలెక్టర్ ప్రతిపాదించిన మండలాలు
  అర్బన్..
 1. మిర్యాలగూడ
 2. సూర్యాపేట
 3. భువనగిరి
 4. కోదాడ
 5. నల్లగొండ
 

 రూరల్..
 6. నేరడుగొమ్ము
 7. కొండమల్లేపల్లి
 8. మోటకొండూరు
 9. తిరుమలగిరి
 10. అడ్డగూడూరు
 11. గట్టుప్పల్
 12. నాగారంబంగ్లా
 (అర్వపల్లిలోని నాలుగు గ్రామాలతోపాటు ఇతర మండలాల్లోని పలు
 గ్రామాలను కలిపి)
 13. మాడ్గులపల్లి

 
 నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట ఖాయం
 మండలాలపై రెండు ప్రతిపాదనలు
 జిల్లాలో నూతనంగా 11 లేదా 13 మండలాలు
 నల్లగొండలోనే మిర్యాలగూడ నియోజకవర్గం
 అర్వపల్లి మండలం నుంచి నాలుగు గ్రామాలు మాత్రమే నాగారం బంగ్లాలోకి.. మిగతావన్నీ యథాతథం
 సీఎస్ నాజీవ్‌శర్మకు సమగ్ర నివేదికను అందజేసిన
 కలెక్టర్ సత్యనారాయణరెడ్డి

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  జిల్లాల విభజన బంతి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. సుమారు ఏడు గంటలపాటు సాగిన సమావేశంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి జిల్లా విభజనకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎస్‌కు అందజేశారు. ప్రస్తుతం ఉన్న నల్లగొండను సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాలుగా విభజించాలని ఇదివరకే ఖరారైన నేపథ్యంలో మండలాలలకు సంబంధించి రెండు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
 
 మొదటి ప్రతిపాదన ప్రకారం నల్లగొండ జిల్లాలో 11 కొత్త మండలాలు ఉన్నట్లు తెలిసింది. అర్బన్ మండలాలు మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, నల్లగొండతోపాటు  రూరల్ మండలాలుగా నేరడుగొమ్మ, కొండమల్లేపల్లి,మోటకొండూరు, తిరుమలగిరి, అడ్డగూడురు, గట్టుప్పల్‌ను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. రెండో ప్రతిపాదన ప్రకారం 13 కొత్త మండలాలను ప్రతిపాదించారు. మొదటి ప్రతిపాదనలోని 11తోపాటు నాగారంబం గ్లా (అర్వపల్లి), మాడ్గులపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేయవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
 
 అర్వపల్లి మండలంలోని వర్ధమానుకోట, నాగారం, కొత్తపల్లి, మాచిరెడ్డిపల్లితోపాటు ఇతర మండలాల్లోని మరికొన్ని గ్రామాలను  నాగారంబంగ్లా మండలంలో చేర్చారు. జిల్లాలు, మండలాలతోపాటు ఉద్యోగుల విభజన, కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ఏర్పాటుకు సంబందించిన స్థలాలు, తాత్కాలిక భవనాల ఎంపిక, నూతన మండలాల్లో చేర్చేగ్రామాల వివరాలు, ఇతర జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లో చేర్చే మండలాల గురించి సమగ్ర నివేదికను సీఎస్‌కు కలెక్టర్ సమర్పించారు.
 
 నల్లగొండలోనే మిర్యాలగూడ..
 ముందుగా ప్రతిపాదించినట్లు సూర్యాపేటలో కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్  నివేదించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ  ప్రతిపాదన చేసినట్లు సీఎస్‌కు సమర్పించిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నట్లు తెలిసింది.
 
 యాదాద్రిలోకి ఇతర జిల్లాల మండలాలు
 భువనగిరి కేంద్రంగా ఏర్పాటయ్యే యాదాద్రి జిల్లాలోకి నల్లగొండలోని జిల్లాతోపాటు వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన నాలుగైదు మండలాలు రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ ప్రతి పాదనలు చేశారు. అదేవిధంగా యాదాద్రి జిల్లా కోసం 13 వేల స్క్వేర్‌యార్డుల భవనాలు అందుబాటులో ఉన్నాయని.. సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నాలుగు స్థలాలను ఎంపిక చేసినట్లు నివేదికలో పొందుపరిచారు. కాగా, సమావేశంలో ముందుగా జిల్లాలను ఏర్పాటు చేయాలని అందరు అభిప్రాయ పడ్డారు. తొలుత జిల్లాలు ఏర్పాటు చేసి.. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలను ఏర్పాటు చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ  ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని.. ఈ మేరకు మరోసారి సీఎంతో సమావేశం ఉంటుందని సీఎస్ వెల్లడించినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు