పనులెలా జరుగుతున్నాయి ?!

4 Jun, 2020 12:24 IST|Sakshi

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కలెక్టర్, కమిషనర్‌

అఫ్జల్‌నగర్‌తో పాటు పలు కాలనీల్లో పర్యటన

కాజీపేట రూరల్‌ : గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని కాజీపేట దర్గా సమీపాన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి బుధవారం తనిఖీ చేశారు. కాజీపేట 36వ డివిజన్‌ దర్గా రైల్వే గేట్‌ నుండి అప్జల్‌ నగర్‌ కాలనీ వరకు రెండు కి.మీ. మేర నిర్మిస్తున్న బాక్స్‌ డ్రెయినేజీ పనులను పరిశీలించారు. అలాగే, మూడో రైల్వే ట్రాక్‌కు సంబంధించి కల్వర్టును తనిఖీ చేశారు. అనంతరం అప్జల్‌నగర్‌ ప్రాంతాన్ని తనిఖీ చేసి డ్రెయినేజీలు, రోడ్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. మలేరియా నివారణ కోసం ఆయిల్‌ బాల్స్‌ను డ్రెయినేజీలో వేయించిన వారు ద్రావణాలను పిచికారీ చేయించారు.

కార్యరంగంలోకి..
గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి కమిషనర్‌ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా కాజీపేటలో ట్రాక్‌ వెంట పనులను పరిశీలించిన వారు కాలనీల్లో పర్యటనకు బయలుదేరారు. మార్గమధ్యలో పెద్ద డ్రెయినేజీ రాగా తొలుత కలెక్టర్‌ దానిపై నుంచి జంప్‌ చేశారు. ఆ వెంటనే కమిషనర్‌ సత్పతి సైతం ఎలాంటిజంకు లేకుండా ఇలా జంప్‌ చేయడం విశేషం.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ, కమిషనర్‌ పమేలా సత్పతి అప్జల్‌నగర్‌ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కాగా, ఫాతిమానగర్‌ నుంచి దర్గాకు వెళ్లే ప్రధాన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరగా, స్థానిక సమస్యలపై కార్పొరేటర్‌ అబూబక్కర్‌ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ సంతోష్, సరిత, ఏఈలు నరేందర్, ముజామిల్, జవాన్‌ సుధాకర్, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మెరుగైన జీవన ప్రమాణాల కోసమే..
కాజీపేట అర్బన్‌ : నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రూపొందించినట్లు కమిషనర్‌ పమేలా సత్పతి తెలిపారు. 33వ డివిజన్‌లోని భట్టుపల్లి, కొత్తపల్లి, 35వ డివిజన్‌లోని కడిపికొండలో పలు కాలనీలను కమిషనర్‌ బుధవారం పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాలని స్థానికులకు సూచించారు. భట్టుపల్లిలో డ్రెయినేజీలు, కొత్తపల్లిలో రోడ్డు సమస్యను స్థానికులు కమిషనర్‌కు విన్నవించగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆర్‌ఎఫ్‌ఓ నారాయణ, ఏఈ ముజామిల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు