పాలమూరుపై చెరగని ముద్ర

4 Feb, 2020 09:29 IST|Sakshi
మయూరి పార్కు అభివృద్ధిపై సూచనలు చేస్తున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ (ఫైల్‌)

సాక్షి, మహబూబ్‌నగర్‌: పునరి్వభజన అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డి.రొనాల్డ్‌రోస్‌ చెరగని ముద్ర వేశారు. విస్తృత తనిఖీలతో ప్రభుత్వ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మిషన్‌ కలాం పేరుతో ఎన్‌జీఓలను భాగస్వాములను చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్‌ విధానంతో సులువుగా అనుమతులు, ఫైళ్ల నిర్వహణతో పనిభారాన్ని తగ్గించగలిగారు. భూప్రక్షాళన ద్వారా జిల్లాలో పకడ్బందీగా భూరికార్డుల నవీకరణ చేపట్టారు.

ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’లో సమూల మార్పులు తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్సు కోసం అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలను అనుసంధానం చేశారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రాజెక్టుల భూసేకరణ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో విలక్షణమైన పాలనతో మెరుగైన ఫలితాలు సాధించినందుకు దేశ, రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి.

మయూరి పార్కులో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ (ఫైల్‌)

జిల్లాకు అవార్డులు.. 
మహబూబ్‌నగర్‌ జ్లిలా వెబ్‌సైట్‌కు 2018 డిజిటల్‌ ఇండియా అవార్డ్స్‌లో భాగంగా వెబ్‌రత్న డిస్ట్రిక్ట్‌ అవార్డు వరించింది. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్‌ విధానాన్ని తీసుకురావడం ద్వారా స్కోచ్‌ 2018, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ అవార్డు–2019 సాధించారు. వాటర్, శానిటేషన్, హైజీన్‌కు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ నుంచి అవార్డు అందుకున్నారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, శిక్షణకు సంబంధించి బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు–2019 వరించింది.

డిజిటల్‌ సేవల అనుసంధానం 
డిజిటల్‌ సేవలను జిల్లాలోని అన్ని శాఖలకు విస్తరించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ–ఆఫీస్‌ సేవలు, డిస్ట్రిక్ట్‌ వెబ్‌సైట్‌ రూపకల్పన, ప్రతీ ప్రభుత్వ శాఖకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల నిర్వహణ వంటి వాటితో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టారు. సాంకేతికపరమైన సేవలను వినియోగించుకుని ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు చేరువ చేయడంలో తనదైన శైలితో పాలన సాగించారు. ప్రజావాణి, సమాచారహక్కు చట్టం వంటి ఫిర్యాదులను ఆన్‌లైన్‌ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పించారు.

మిషన్‌ భగీరథ పథకంపై సమీక్ష (ఫైల్‌)

సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ.. 
జిల్లాలో శాసనసభ, పార్లమెంటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేస్తూ ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా రూపకల్పన చేయడంతో పాటు ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యతను చాటారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.  

సంక్షేమంపై ప్రత్యేక దృష్టి 
దివ్యాంగుల సంక్షేమానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు ఉపాది కలి్పంచేందుకు దివ్యాంగుల సోలార్‌ సొసైటీని ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు. చెవిటి, మూగ, దివ్యాంగుల పిల్లలకోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. స్త్రీ,శిశు సంక్షేమంలో భాగంగా మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో అంగన్‌వాడీ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు చర్యలు చేపట్టారు. మాతా శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బాల్యవివాహాల నివారణపై దృష్టి సారించారు. ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా బాలకారి్మక వ్యవస్థ నిర్మూలకు చర్యలు చేపట్టారు.  

అభివృద్ధి పనుల్లో వేగం 
జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మయూరి పార్కును రాష్ట్ర, దేశస్థాయి నాయకులు, అధికారులు సందర్శించేలా చర్యలు తీసుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించగలిగారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిని వేగిరం చేశారు.  

సస్పెన్షన్లతో హడల్‌.. 
కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పరిపాలనలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపై కఠనంగా వ్యవహరిస్తూ హడలెత్తించారు. విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లో విధులపై నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలకు వెనుకాడలేదు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, తదనంతరం పది రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతలు, శ్వశానవాటిక, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, కంపచెట్ల తొలగింపు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి నిర్వహణపై తగు చర్యలు తీసుకున్నారు. 

24 గంటల్లో  380 మరుగుదొడ్లు 
స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 24 గంటల్లోనే 380 మరుగుదొడ్లను నిర్మింపజేసి దేశ స్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు గుర్తింపును తెచ్చారు. నిరీ్ణత సమయానికంటే ముందే జిల్లాను వంద శాతం మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటించారు.

  

మరిన్ని వార్తలు