ఈ పని చరిత్రలో నిలిచిపోతుంది..

17 Feb, 2018 11:14 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

‘భూప్రక్షాళన’ సక్సెస్‌ మీట్‌లో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

ఉద్యోగులు, కుటుంబాలతో సమావేశం

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ‘ఆరు నెలలుగా రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వచ్చి ఏం చేశారో ప్రతీ ఒక్కరికి తెలుసు.. క్షేత్ర స్థాయికెళ్లి ఇంటింటికి తిరిగి మీరు చేసిన పని మామూలు విషయం కాదు.. భూ ప్రక్షాళన కార్యక్రమం ద్వారా చేసిన రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్‌ పని చరిత్రలో నిలిచిపోతుంది... ప్రజలందరు మీరు చేసిన పనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు..  ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం పెరిగింది’ అని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ అభినందించారు. జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో శుక్రవారం జరిగిన రెవెన్యూ ఫ్యామిలీ సక్సెస్‌ మీట్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. రెవెన్యూలోని ప్రతీ ఉద్యోగికి రెవెన్యూ రికార్డులు, ఇతర పనులపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ఎంతో కష్టపడి చేసిన పని ద్వారా ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. జిల్లాలో జరుగుతున్న భూప్రక్షాళన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నర్సింహన్, కేంద్ర బృందం సంతృప్తిని వ్యక్తం చేసిందన్నారు. మహబూబ్‌నగర్‌ను అనుసరిస్తూ అన్ని జిల్లాలలో భూప్రక్షాళన పనులు చేపట్టడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఇచ్చిన ఐడియాల ద్వారానే భూప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. 

కష్టసుఖాలు తెలుసుకునేందుకే..
ఎప్పుడూ తీరిక లేకుండా సిబ్బంది ఫ్యామిలీలతో గడపడంతో పాటు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. ఎప్పుడూ ఆఫీసు విషయాలే మాట్లాకోకుండా మనమంతా ఓ రోజు ఫ్యామిలీతో పాటు గడపడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులుందరికీ మయూరి నర్సరీ ప్రత్యేకతలను వివరించాలని సర్వే ల్యాండ్‌ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డికి సూచించారు. 

ఏ జిల్లాలోనూ చేయలేదు
భూప్రక్షాళన కార్యక్రమాన్ని ఇతర జిల్లాలతో పోటీ పడి నిర్వహించడం జరిగిందని ఇన్‌చార్జి జేసీ కృష్ణాదిత్య అన్నారు. అన్ని జిల్లాలు పాలమూరును అనుసరించాయని, ఏ జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదని తెలపారు. రెవెన్యూ సిబ్బంది పూర్తి సహకారం అందించి భూప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూప్రక్షాళన కార్యక్రమం రెవెన్యూలో పని చేస్తున్న వీఆర్‌ఏ, కంప్యూటర్‌ ఆపరేటర్ల నుండి ఉన్నతాధికారి వరకు పూర్తి సబ్జెక్టు అవగాహన కలిగిందని మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ లక్ష్మీనారాయణ అన్నారు. దీనికి కొనసాగింపుగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగికి ఎంతో ధైర్యం ఇచ్చి నెలియని విషయాలపై సూచనలు ఇస్తూ ముందుకు నడిపించిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. అంతకు ముందు ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అడ్డాకుల తహసీల్దార్‌ మాట్లాడుతూ తాను బాధ్యతల్లో చేరగానే భూప్రక్షాళన జరగడంతో ఎంతో ఇబ్బంది పడ్డానని.. అయినా కార్యాలయ సిబ్బంది ఎంతగానో సహకరించారంటూ ఉద్వేగానికి గురయ్యారు. డీఆర్వో కె.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కొమురయ్య, మెప్మా పీడీ గోపాల్, ఫారెస్ట్‌ సెటిల్‌మెంటు అధికారి రాంచందర్, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బెన్షాలో, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నకిష్టప్ప, తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఆర్‌ఐలు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు. అనంతరం భూప్రక్షాళనలో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా