కలెక్టర్‌ అయ్యేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు..

8 Dec, 2019 07:46 IST|Sakshi
తిర్మలాపూర్‌ పాఠశాలలో విద్యార్థులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

రైల్వేలో ఉద్యోగం వచ్చినా.. ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం

ప్రతి విద్యార్థి లక్ష్యం నిర్దేశించుకొని చదవాలి

విద్యార్థులతో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ముఖాముఖి

తిర్మలాపూర్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ

రాజాపూర్‌ (జడ్చర్ల): ‘కష్టపడితేనే ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు బాగా చదవాలి. మొదట రైల్వేలో ఉద్యోగం వచ్చినా కలెక్టర్‌ కావాలనేదే నా లక్ష్యం. దానిని చేరుకునేందుకు ఎంతో కష్టపడి చదివా. నిద్రలేని రాత్రిళ్లు గడిపా. మీరు కూడా లక్ష్యాన్ని ఎంచుకొని.. ఆ దిశగా చదవండి’ అని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు విషయాలు, సూచనలు చేశారు. మొదట పదో తరగతి విద్యార్థులు శ్రీవాణి, వైష్ణవి విద్యార్థులను పిలిచి మీ పాఠశాలలో అన్ని మౌళిక వసతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. వారు సమాధానమిస్తూ.. పాఠశాలకు ప్రహరీ లేదు అని అన్నారు. దీంతో ఇంటికి వంద.. బడికి చందా కార్యక్రమంలో మౌళిక వసతులు కల్పించుకోవాలని చెప్పాం కదా అని కలెక్టర్‌ సూచించారు. 

ఇంటికో పది పెల్లలు తెచ్చుకోండి
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఏం పర్వాలేదని, ఇంటికో పది ఇటుకలు తెచ్చుకోండని,  మిగతా సిమెంట్‌ తదితర వస్తువులను నేను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో ప్రహరీని పూర్తి చేద్దామని పేర్కొన్నారు. మన వసతులను మనమే సమకూర్చుకుందామని సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం కరాటే తరగతులను నిర్వహించాలని ముఖ్యంగా బాలికలకు తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనుకున్న లక్ష్యం చేరుకోకపోతే గ్రామీణ స్థాయిలోనే మన జీవితం ఉంటుందని, ఐఏఎస్‌ కావాలనేది తన లక్ష్యమని, రైల్వేలో ఉద్యోగం వచ్చినా.. ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు చదివి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఉపాధ్యాయుడికి అభినందనలు
ఇదిలాఉండగా, కారులో నుంచి కలెక్టర్‌ దిగి పాఠశాల ఆవరణలోకి వచ్చే క్రమంలో ఓ ప్లాస్టిక్‌ కవర్‌ కనిపించింది. దీంతో కలెక్టర్‌ ఆ కవర్‌ తీసుకొని ఉపాధ్యాయుడు లక్ష్మినారాయణ చేతికి ఇవ్వడంతో.. ఆయన అట్టి కవర్‌ను జేబులో పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్‌ వెరీగుడ్‌ అని అభినందించారు. డ్రెసింగ్‌ విషయంలో కూడా ఉపాధ్యాయులందరూ చక్కగా ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు