ఉన్నారా.. లేరా? 

23 Jul, 2019 08:09 IST|Sakshi
పాలమూరు బీకేరెడ్డి కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో వివరాలు సేకరిస్తున్న పర్యవేక్షకుడు

అంగన్‌వాడీ టీచర్ల పనితీరుపై నజర్‌

ప్రైవేట్‌ వ్యక్తులతో పరిశీలన

ఇటీవల జరిగిన సంఘటన దృష్ట్యా కలెక్టర్‌ సీరియస్‌ 

సమయపాలన, పౌష్టికాహారం పంపిణీపై ఆరా 

అప్రమత్తమైన టీచర్లు, ఆయాలు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పాలమూరు అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని హన్వాడ, గండీడ్, మహబూబ్‌నగర్‌ పట్టణంలో గల అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు గాను ఐసీడీఎస్‌తో సంబంధం లేని వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించారు. వారునేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి వారి పనితీరును పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు భోజనం అందుతుందా.. లేదా అనే విషయాలను గురించి పరిశీలిస్తున్నారు. అంతేకాక చిన్నారుల విద్యాభ్యాసం గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి  గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఆయా చిన్నారులను కేంద్రంలోనే ఉంచి తలుపులు మూసివేసి
తమ ఇళ్లకు వెళ్లి వారి సొంత పనులు చేసుకుండటం గమనించిన కలెక్టర్‌ ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అంతటితో ఆగకుండా సీడీపీఓకు మెమో జారీ చేశారు.

 సీక్రేట్‌ పర్యవేక్షకులు 
ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని అన్ని కేంద్రాల పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడానికి కలెక్టర్‌ ప్రైవేట్‌ వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించి సమాచార సేకరణ జరుపుతున్నట్లు తెలిసింది. కేంద్రాలకు వెళ్తున్న ప్రైవేట్‌ పర్యవేక్షకులు అంగన్‌వాడీల పనితీరును పర్యవేక్షిస్తూ సమాచారం సేకరించి నేరుగా కలెక్టర్‌కు నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటినుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సమయానికి కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అధికారులు ఎప్పుడు ఏ కేంద్రానికి వచ్చి సమాచార సేకరణ జరిపి వెళ్తారో, ఎవరి ఉద్యోగాలకు ముప్పు వాటిళ్లుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాక తమ పనితీరును చట్టబెట్టుకొని ఉద్యోగాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు