‘ఆరోగ్యం’లో అవినీతి!

12 Aug, 2015 04:57 IST|Sakshi
‘ఆరోగ్యం’లో అవినీతి!

- ఎన్‌హెచ్‌ఎం నిధుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్
- డీఎంహెచ్‌ఓకు రిమైండర్ నోటీసు
ఖమ్మం వైరారోడ్ :
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు ఉద్యోగులు ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరైన విచారణ చేపట్టకపోవటంతో వారి ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా జాతీయ ఆరోగ్యమిషన్‌లో రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ కలెక్టర్ దృష్టికి వెళ్లటంతో ఆయన డీఎంహెచ్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా వివిధ పీహెచ్‌సీలకు ప్రతీ యేడాది రూ.కోట్లలో నిధులు వస్తుంటాయి. అయితే ఇటీవల ఉన్నతాధికారులు ఆడిటింగ్ చేయగా.. కోటి నిధులకు సంబంధించి లెక్క తేలలేదు. ఎన్‌హెచ్‌ఎం విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

కీలకమైన అధికారి ఆ ఉద్యోగి ద్వారా నిధుల స్వాహా వ్యవహారానికి పాల్పడినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కలెక్టర్ ఇలంబరితి డీఎంహెచ్‌ఓకు రిమైండర్ నోటీసు ఇచ్చారు. వెంటనే ఎన్‌హెచ్‌ఎం నిధుల లెక్కలు చూస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించి.. పర్మనెంట్ ఉద్యోగికి పూర్తిసాయి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఎంకు నిధులు ఇప్పటివరకు ఎన్ని విడుదలయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? మిగిలిన నిధులు ఎన్ని? అనే విషయూలపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినుట్ల తెలిసింది.

దీనికి తోడు 104లో నిధుల దుర్వినియోగంపై కూడా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. రెండేళ్లలో 104 వాహనాల రిపేర్లు, టైర్లు, ఇతర వస్తువుల కొనుగోలు, ఖర్చులకు రూ.కోట్లలో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కూడా భారీగానే అవినీతి జరిగినట్లు తేల్చారు. 104లో కూడా రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది.
ఈ వ్యవహారంలో కూడా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరగా విచారణ చేసి.. నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు