ప్రభుత్వ శాఖలు గాడిలో పడేనా..?

24 Feb, 2020 10:53 IST|Sakshi

ప్రణాళిక లేకుండా పనితీరు

ఎక్కడి ఫైళ్లు అక్కడే..నిస్తేజంలో అధికారగణం

పునరుత్తేజం కోసం ప్రయత్నాలు

దూకుడు పెంచిన కొత్త కలెక్టర్‌ శ్వేతా మహంతి  

నేటి నుంచి రోజుకు మూడు శాఖల చొప్పున సమీక్ష  

ఇక శాఖల వారీగా ఉరుకులు పరుగులు

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ శ్వేతా మహంతి పాలనపై పట్టుసాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యత అంశాలుగా ప్రకటించిన విద్య, వైద్యం, ప్రభుత్వ భూములు, సంక్షేమ పథకాలతో పాటు మిగిలిన ప్రభుత్వ విభాగాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. గతంలో పనిచేసిన ప్రాంత పరిస్థితులకు హైదరాబాద్‌ జిల్లా పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శాఖల వారీగా వరస సమీక్షలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే జిల్లా వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షలు నిర్వహించి లక్ష్య సాధనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రోజుకు మూడు శాఖల చొప్పున ఈ నెల 24 నుంచి 28 వరకు వరుసగా సమీక్షలకు షెడ్యూలు జారీ చేశారు.

రెండేళ్లుగా...
హైదరాబాద్‌ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. ఒక వైపు ప్రభుత్వపరంగా నిధుల విడుదల లేకపోవడం, మరోవైపు పర్యవేక్షణ కొరవడటంతో అధికారులు, ఉద్యోగుల్లో నిస్తేజం నెలకొంది. ఫలితంగా విధి నిర్వహణలో సైతం నిర్లక్ష్యం నెలకొంది. విభాగాల పరంగా ప్రణాళిక లేకుండా పనితీరుతో ఎక్కడి ఫైళ్లు అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. రెండేళ్లలో ఇద్దరు కలెక్టర్లు మారడం, ఆ తర్వాత వరుస ఎన్నికలు, అధికారుల బదిలీలతో శాఖల తీరు అధ్వానంగా తయారైంది. వాస్తవంగా గత రెండేళ్ల క్రితం యోగితారాణా హయంలో కొద్దికాలం ఉరుకులు పరుగులు పెట్టిన వివిధ విభాగాలు, ఆమె బదిలీ తర్వాత పాత పరిస్థితికి చేరాయి. తర్వాత అడపా దడపా సమీక్షలు జరిగినా శాఖల పనితీరు మొక్కుబడిగా తయారైంది. సాక్షాత్తు జిల్లాస్థాయి అధికారులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో క్షేత్రస్థాయి పనితీరు గాడి తప్పింది. తాజాగా కలెక్టర్‌ శ్వేతా మహంతి పనితీరులో కొంత దూకుడు పెంచి నిస్తేజంలో ఉన్న పాలనను పునరుత్తేజం కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో కొంతమేరకు ఆశలు చిగురిస్తున్నాయి.

మరిన్ని వార్తలు