కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌

18 Aug, 2019 19:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

క్షేత్ర స్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్ల వద్ద నుంచి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి, చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడు విషయాలపై లోతైన చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు