కలెక్టర్లూ.. మీరు మారాలి..!

8 Jul, 2014 01:42 IST|Sakshi
కలెక్టర్లూ.. మీరు మారాలి..!
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్లు తమ పద్ధతిని మార్చుకోవాలని  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుతిమెత్తగా కలెక్టర్లకు చురకలు వేశారు. బ్రిటిష్‌కాలంలో మాదిరిగా కాకుండా.. కలెక్టర్లు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్లు తమ కింద పనిచేసే అధికారులు. సిబ్బందితో సుహృద్భావపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. 
 
‘మీరు ఇంగ్లిష్‌లోనే దిగువ  స్థాయి సిబ్బందితో దర్పంతో మాట్లాడితే, వారు భయపడి సమాధానం తెలిసినా... చెప్పలేరని’ ఆయన వ్యాఖ్యానించారు. మీతో మీపై ఉన్నతాధికారులు ఏవిధంగా చనువుగా మెలుగుతారో.. మీరు కూడా మీ కింది అధికారులు, సిబ్బందితో ఆ విధంగానే వ్యవహరించాలని సోమవారం కలెక్టర్ల సమావేశంలో సీఎం చెప్పారు. 
 
ఇది ఉద్యోగులతో స్నేహంగా పాలన సాగించే ప్రభుత్వమని అన్నారు. ఉద్యోగుల్లోనూ, అధికారుల్లోనూ 98 శాతం మంది నిజాయితీ, బాగా పనిచేసే మనస్తత్వం ఉన్నవారేనని, వారిని తమకు అనుగుణంగా మలుచుకుంటే వారితో పనిచేయించుకోవడానికి వీలవుతుందని కేసీఆర్ చెప్పారు. బ్యూరోక్రటిక్ విధానానికి స్వస్తి చెప్పాలని,. రెడ్‌టేపిజం లేకుండా చూడాలని కోరారు. 
 
 పేదలను దృష్టిలో పెట్టుకోండి..
 అధికారులు ఏ పనిచేసినా పేదవారిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. సమావేశంలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త ప్రభుత్వ ఆశయాలు, ఇక్కడి వనరులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదాయవనరులు పెంచుకోవడం తదితర అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయా అంశాలపై ప్రజెంటేషన్‌లు ఇచ్చారు. 
 
మరిన్ని వార్తలు