విద్యార్థులకు విషమ పరీక్ష!

4 Mar, 2020 02:32 IST|Sakshi

ఫీజులు వసూలు చేసి ఇంటర్‌ బోర్డుకు చెల్లించని శ్రీమేధా‘వి’ కాలేజీ

నేటి నుంచే పరీక్షలు.. అయినా విద్యార్థులకు అందని హాల్‌టికెట్లు..

చొరవ చూపిన ఇంటర్‌ బోర్డు.. హాల్‌టికెట్ల జారీకి అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: తెల్లారితే ఇంటర్‌ పరీక్షలు.. అయినా ఆ కాలేజీ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. అడిగితే ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయి.. అంటూ యాజమాన్యం విద్యార్థులను మభ్య పెట్టింది. చివరికి ఇంటర్‌ బోర్డు అధికారులను కలసే వరకు అసలు విషయం తెలియలేదు. వారి నుంచి ఫీజులను వసూలు చేసిన యాజమాన్యం బోర్డుకు చెల్లించలేదని తెలిసింది. హైదరాబాద్‌ (కొత్తపేట)లోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు అసలు పరీక్షలకు ముందు మరో కఠిన పరీక్షనే ఎదుర్కొన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, మంగళవారం రాత్రి వరకు కూడా వారి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో వారంతా ఆం దోళన చెందుతూ ఇంటర్మీడియట్‌ బోర్డును సంప్రదించారు. 

స్పందించిన ఇంటర్‌ బోర్డు..  
ఇటు విద్యార్థులకు హాల్‌టికెట్లు అందని విషయంపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెంటనే స్పందించింది. విద్యార్థుల ఫీజు చెల్లించడం మర్చిపోయామని కొత్తపేటలోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం తెలిపిందని, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు అనుమతించామని బోర్డు తెలిపింది. 48 మంది విద్యార్థుల జాబితాతో మంగళవారం తమ వద్దకు కాలేజీ యాజమాన్యం వచ్చిందని బోర్డు వెల్లడించింది. వారి లో 11 మంది ఫస్టియర్‌ కాగా మిగిలిన వారు సెకండియర్‌ విద్యార్థులున్నారని తెలిపింది. మరో ఘటనలో హన్మకొండకు చెందిన బీఆర్‌ అంబేడ్కర్‌ వొకేషనల్‌ కాలేజీ కూడా మంగళవారం 30 మంది విద్యార్థుల జాబితాతో బోర్డును ఆశ్రయించింది. కాగా, వీరికి గత నెల 20నే ప్రాక్టికల్‌ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు వీరిని థియరీ పరీక్షలకు అనుమతించినా ఫెయిల్‌ కిందే లెక్క.. అందుకే వీరిని మేలో జరగనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవ్వాలని సూచించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన రెండు కాలేజీల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు