సెప్టెంబర్‌లో కొత్త క్లాసులు

30 Apr, 2020 02:34 IST|Sakshi

ప్రస్తుత విద్యాసంవత్సర ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూలైలో 

నిపుణుల కమిటీ సిఫార్సులన్నిటికీ ఆమోదం 

ప్రజెంటేషన్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌తోపాటు పరీక్ష సమయం తగ్గింపు 

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలకు సూచన

సాక్షి, హైదరాబాద్‌ : విశ్వవిద్యాలయాల్లో చేరనున్న కొత్త విద్యార్థులకు నూతన అకడమిక్‌ సెషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పేర్కొంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్‌లోనే ప్రారంభించవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సర ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు అన్నింటికీ యూజీసీ ఆమోదం తెలిపింది. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంతోపాటు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షలు, ఓపెన్‌ చాయిస్‌ అసైన్‌మెంట్స్, ప్రజెంటేషన్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. అలాగే పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించడానికి ఓకే చెప్పింది.

అవకాశముంటే గతంలో సెమిస్టర్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం మార్కులను ఇవ్వడం, 50 శాతం మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా ఇవ్వడానికి అంగీకరించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ముందు సెమిస్టర్‌ మార్కులుండవు కనుక 100 శాతం ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా ఇవ్వొచ్చని పేర్కొంది. ప్రతి విద్యార్థిని తదుపరి సెమిస్టర్‌/సంవత్సరానికి ప్రమోట్‌ చేయాలని పేర్కొంది. విద్యార్థులు గ్రేడ్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే వచ్చే సెమిస్టర్‌లో ప్రత్యేకంగా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్ని కోర్సులకు ఒకే రకమైన విధానాన్ని అవలంభించాలని పేర్కొంది.  చదవండి: రికార్డు స్థాయిలో మరణాలు 

పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లోనా అన్న విషయాన్ని తమకున్న వనరులు, విద్యార్థుల వెసులుబాటులను దృష్టిలో పెట్టుకుని వర్సిటీలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు క్లాస్‌లకు హాజరయినట్లే భావించాలంది. ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు అదనంగా ఆరు నెలల సమయం ఇవ్వాలని పేర్కొంది. వైవా పరీక్షను వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. తాము పేర్కొన్నవన్నీ సూచనలుగా భావించాలని, పరిస్థితులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం సెమిస్టర్‌కే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే చేపట్టాల్సిన చర్యలపైనా మార్గదర్శకాలు జారీ చేసింది.  

కొన్ని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆన్‌లైన్, ఈ–లెర్నింగ్‌ విధానంలో మిగిలిపోయిన సిలబస్‌ను మే 31వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్క్స్‌ను మే 16 నుంచి 31లోగా పూర్తి చేయాలని తెలిపింది. జూన్‌ 16 నుంచి 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలంది. జూన్‌ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి వస్తే మాత్రం జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలి. ఇవి మినహా 2020–21, 2021–22లో విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలకు, పరీక్షల విధానాలకు ఓకే చెప్పింది. 
ప్రస్తుత కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థ విద్యార్థులు గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. వాటిని త్వరగా పరిష్కరించాలి. 
యూజీసీ కూడా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పరీక్షలు, అకడమిక్‌ కార్యక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. 
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనివర్సిటీలు సోషల్‌ డిస్టెన్స్‌ అమలు చేసేలా పక్కా ఏర్పాట్లు చేయాలి. 
విద్యా సంస్థల్లో 25 శాతం బోధన ఆన్‌లైన్‌లో చేపట్టేలా, 75 శాతం బోధన ప్రత్యక్ష పద్ధతిలో చేసేలా చర్యలు చేపట్టాలన్న సిఫారసుకు యూజీసీ ఓకే చెప్పింది.  
రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్స్‌ ఇచ్చినా సాధారణ పరిస్థితి వచ్చాక, వీలైతే జూలైలో వారికి పరీక్షల నిర్వహించాలని పేర్కొంది.  
ప్రతి యూనివర్సిటీ కరోనా (కోవిడ్‌–19) సెల్‌ను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, అకడమిక్‌ కేలండర్, పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలి. 
ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించేలా ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలి. 6 రోజుల పని విధానం అమలు చేయాలి. 
ఇప్పటికే ఉన్న విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి, ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తరగతులూ ప్రారంభిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం మాత్రం 2021 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.   

>
మరిన్ని వార్తలు