వీరుడా.. వందనం

18 Jun, 2020 01:59 IST|Sakshi
బుధవారం హకీంపేట విమానాశ్రయంలో సంతోష్‌ పార్థివదేహానికి సెల్యూట్‌ చేసి నివాళులర్పిస్తున్న సైనికాధికారులు 

కల్నల్‌ సంతోష్‌బాబుకు జోహార్లు అర్పించిన జనం

జాతీయ జెండాలు, సంతోష్‌ చిత్రపటాలతో ర్యాలీలు 

ఆయన నివాసానికి భారీగా తరలివచ్చిన నేతలు, అభిమానులు

సూర్యాపేటకు చేరుకున్న అమరవీరుడి పార్థివదేహం 

నేడు అంత్యక్రియలు 

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/తాళ్లగడ్డ: భారత్‌–చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబుకు జనం జోహార్లు అర్పించారు. జాతీయ జెండాలు, సంతోష్‌ చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో జై జవాన్‌.. జోహార్‌ సంతోష్‌ అనే నినాదాలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు, అభిమానులు, బంధువులు బుధవారం పెద్ద ఎత్తున సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సంతోష్‌ తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్‌–మంజులను పరామర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కల్నల్‌ స్థాయి అధికారి సూర్యాపేటలో ఉండటం.. భారత్‌–చైనా సరిహద్దు ఘర్షణలో ఆయన వీరమరణం పొందడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చివరిసారిగా సంతోష్‌ను చూసేందుకు భారీగా ఆయన నివాసానికి తరలివచ్చారు. రాత్రి ఆయన పార్ధివదేహం వచ్చేవరకు అక్కడే ఉన్నారు.

బుధవారం హకీంపేట ఎయిర్‌బేస్‌లో సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఆయన సతీమణి సంతోషి 

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు:
సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 11.40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. పార్థివదేహం వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌లో సంతోష్‌బాబు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుథ్‌ వచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌నుంచి సంతోష్‌ నివాసం వరకు ప్రజలు కొవ్వొత్తులు, జాతీయ జెండాలతో రోడ్డుకు ఇరువైపులా ఉండి అమరవీరుడికి జైజైలు పలికారు. సంతోష్‌బాబు అమర్‌రహే, భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. కాగా, కల్నల్‌ సంతోష్‌బాబు పార్థి«వదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, సంతోష్‌బాబు సతీమణి సంతోషి చిన్నారులను చూసుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ విలపించడంతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

కల్నల్‌ పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

నేడు కేసారంలో అంత్యక్రియలు 
సూర్యాపేట పట్టణానికి సమీపంలోని కేసారంలో కల్నల్‌ సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, ఆర్మీ మేజర్‌ ఫరీది, ఆర్డీఓ మోహన్‌రావు, డీఎస్పీ మోహన్‌కుమార్, కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, ఆర్మీ అధికారి దినేష్‌కుమార్‌ పరిశీలించారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని జేసీబీలతో చదును చేయించారు. ప్రోటోకాల్‌ ప్రకారం కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. బుధవారం ఆర్మీకి చెందిన 50 మంది అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు సంతోష్‌బాబు నివాసం వద్ద ఆయన పార్థివదేహానికి సైనిక సంప్రదాయం ప్రకారం రీత్లింగ్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు.

ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్‌ నివాసం నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. సంతోష్‌ను కడసారి చూసేందుకు వచ్చేవారు కరోనా నిబంధనలను అనుసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ మేజర్లు, కల్నల్స్‌తోపాటు కొద్ది మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. సంతోష్‌ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న కేటీఆర్‌ 

సందర్శకులు 8 గంటల్లోగా రావాలి... 
కల్నల్‌ సంతోష్‌ పార్థివదేహాన్ని సందర్శించాలనుకునేవారు ఉదయం 8 గంటల్లోగా రావాలని జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం కల్నల్‌ సంతోష్‌ ఇంటి వద్ద నుంచి సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కరోనా నిబంధనల మేరకు 50 మందిని మాత్రమే దహన సంస్కారాలకు అనుమతించనున్నట్లు తెలిపారు.

హకీంపేట ఎయిర్‌బేస్‌లో కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ టీఎస్‌ నారాయణన్‌  

పరామర్శల వెల్లువ.. 
కల్నల్‌ సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు ఆయన తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజులను పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్, ప్రముఖ మోటివేటర్‌ బ్రదర్‌ షఫీ తదితరులు ఉన్నారు.

బుధవారం రాత్రి సూర్యాపేటలో సంతోష్‌ పార్థివదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు (ఇన్‌సెట్‌లో)  సంతోష్‌ భౌతికకాయం 

ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు 
ఈ నెల 14వ తేదీ నా పెళ్లిరోజున అన్నయ్య ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఎలా ఉన్నావ్‌ అన్నయ్యా అంటే ఏం చెప్పలేను, నన్ను అడుగొద్దు అన్నాడు. చాలా బాధగా అనిపించింది. అన్నయ్య మాతో చాలా ప్రేమగా ఉండేవాడు.. ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. సెలవుల్లో వచ్చినప్పుడు పండుగలా గడిపేవాళ్లం. చిన్నప్పటి నుంచి చదువుల్లో యాక్టివ్‌గా ఉండేవాడు. అన్నయ్య చదువు కోసమే మేమంతా అదిలాబాద్‌ నుంచి విజయనగరం వెళ్లాం. సైనిక్‌ స్కూల్‌ ఎంట్రెన్స్‌లో మూడోర్యాంక్‌ వచ్చింది. పాకిస్తాన్‌ వంటి ఎంతో ఉద్రికత్త ఉన్న ప్రాంతాల్లోనే అన్న డ్యూటీ నిర్వహించాడు. కొంతమంది చొరబాటుదారులను అంతమొందించాడు. అప్పుడు చాలా గర్వంగా ఫీల్‌ అయ్యాం. చైనా సరిహద్దులో తుపాకులు వాడకపోవడంతో ఇలాంటి దారుణం జరిగింది. అన్నయకు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు.  – శృతి, కల్నల్‌ సంతోష్‌బాబు చెల్లెలు 

కల్నల్‌ సంతోష్‌బాబుకు గవర్నర్‌ సహా పలువురి నివాళి  
సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి సంతోష్‌ భౌతికకాయం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై.. ఆయన పార్థివదేహం ఉన్న పేటికపై పుష్పగుచ్ఛం ఉంచి వందనం చేశారు. సంతోష్‌ ధీరత్వాన్ని దేశం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు జన్మస్థలం అయిన తెలంగాణకు తాను గవర్నర్‌ కావడం గర్వంగా ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందే తెలంగాణ, ఆంధ్ర సబ్‌ ఏరియాకు చెందిన సైనిక ఉన్నతాధికారులతో కలసి కల్నల్‌ సంతోష్‌ భార్యాపిల్లలు హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సంతోషపార్థివదేహానికి మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్, లెఫ్టినెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌లతోపాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్, ఇతర సైనికాధికారులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంతోష్‌ భౌతికకాయాన్ని సూర్యాపేట తరలించారు. 

మీతో మేమున్నాం.. ధైర్యంగా ఉండండి

  • కల్నల్‌ సంతోష్‌ సతీమణికి ఏఐసీసీ చీఫ్‌ సోనియా, రాహుల్‌గాంధీ లేఖలు  

సాక్షి, హైదరాబాద్‌: గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల ఘాతుకానికి బలైన కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఏఐసీసీ చీఫ్‌ సోనియాగాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆమె సంతోష్‌ సతీమణి సంతోషికి లేఖ రాశారు. ‘మాతృభూమి రక్షణ కోసం మీ భర్త ప్రాణాలు కోల్పోయారు. ఆయన చేసిన త్యాగాన్ని, గుండె ధైర్యాన్ని ఎప్పటికీ మరువలేం. ఆయనను గౌరవంగా స్మరించుకుంటూనే ఉంటాం. కల్నల్‌ మరణం పట్ల నా హృదయాంతరాల నుంచి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన భరతమాత కన్న వీరుడు. మీ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలి. కల్నల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని ఆ లేఖలో సోనియాగాంధీ తన సందేశాన్ని పంపారు.

వీరుడికి సెల్యూట్‌: రాహుల్‌
దేశంలోని ప్రతి పౌరుడు శాంతితో స్వతంత్రంగా జీవించేందుకు కల్నల్‌ సంతోష్‌బాబు చేసిన త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ కొనియాడారు. భరతజాతి ఒక దేశ భక్తుడిని కోల్పోయిందని, ఇలాంటి కష్టకాలంలో జాతి యావత్తు కల్నల్‌ కుటుంబానికి అండగా ఉంటుందని బుధవారం సంతోష్‌బాబు సతీమణికి రాసిన వేరొక లేఖలో రాహుల్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు