అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం : కల్నల్‌ సంతోష్‌ సోదరి

17 Jun, 2020 13:38 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ‘అన్నయ్య కొద్ది రోజులు పాకిస్తాన్‌ బార్డర్‌లో పని చేశాడు. ఆ సమయంలో కొంతమంది చొరబాటుదారుల్ని ఆన్నయ్య హతమార్చాడు. అప్పుడు మేము ఎంతో గర్వంగా ఫీలయ్యాం. దేశం కోసం అన్నయ్య చేస్తున్న సేవను చూసి మురిసిపోయాం. ఎంతో రిస్క్‌ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాల్లో ఇలా జరగడం బాధగా ఉంది. అన్నయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు చైనాతో ఘ‌ర్షణలో మ‌ర‌ణించిన క‌ల్నల్‌ సంతోష్‌బాబు సోదరి శృతి. తనతో ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నయ్య.. ఇక లేడనే విషయాన్ని ఆ సోదరి తట్టుకోలేకపోతోంది. తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
(చదవండి : తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు)

‘చిన్నప్పటి నుంచి అన్నయ చాలా యక్టివ్‌. చదువులో కానీ, ఇతర కాంపిటీషన్లలో కానీ అన్నింట్లో ముందుండేవాడు. సైనిక్‌ స్కూల్‌ గురించి డాడీ చిన్నప్పుడే ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఆయన కోరిక మేరకు అన్నయ్య సాధించాడు. అన్నయ్య గురించే డాడీ ఆదిలాబాద్‌ నుంచి విజయనగరం ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకొని అక్కడికి వెళ్లాము. అన్నయ్య ఒక సంవత్సరం మొత్తం కష్టపడి సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో పాసయ్యారు. అక్కడ మాకు తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అమ్మ, డాడీ సపోర్ట్‌తో అన్నయ్య ఆల్‌ ఇండియా 3వ ర్యాంకు సాధించారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అన్నయ్య 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తర్వాత అన్నయ్య కమిషనర్‌ అయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అన్నయ్య కమిషనర్‌ అయ్యారు. తర్వాత పాకిస్తాన్‌ బార్డర్‌లో పనిచేశారు. అప్పడు కూడా కొంతమంది చొరబాటుదారుల్ని హతమార్చారు. అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం. ఎంతో రిస్క్‌ ఉన్న ఏరియాల్లోనే బాగా విధులు నిర్వర్తించారు. కానీ పెద్దగా రిస్క్‌లేని ఏరియాలో ఇలా జరగడం బాధగా ఉంది. ( చదవండి : చైనాతో ఘర్షణ: 20 మంది భారత జవాన్లు మృతి!)

అదే లాస్ట్‌ కాల్‌
రెండు రోజుల క్రితం జూన్‌ 14 రాత్రి 9 గంటల ప్రాంతంలో అన్నయ్య మాతో మాట్లాడారు. ఆ రోజు మా పెళ్లి రోజు. మాకు విషెష్‌ చెప్పడం కోసమే అన్నయ్య కాల్‌ చేశారు. కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. ఎలా ఉన్నావ్‌ అన్నయ్యా అని అడగ్గా.. ఏం చెప్పలేను. నన్ను అడుగొద్దు అన్నాడు. తర్వాత అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. 

అప్పడు చాలా సంతోష పడ్డాం
అన్నయ్య హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారని తెలియగానే ఎంతో సంతోష పడ్డాం. అన్నయ్య చిన్నప్పటి నుంచి మాకు దూరంగా పెరిగాడు. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే అందరం కలిసి హ్యాపీగా ఉంటాం అనుకున్నా.ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మా వదిన, పిల్లల్ని ఎలా సముదాయించాలో అర్థం కావడంలేదు. ఉద్యోగం రిత్యా అన్నయ్య పిల్లలతో (కూతురు అభిజ్ఞ(9), కుమారుడుఅనిరుధ్‌(4) ) ఎక్కువగా గడపలేదు. అనురిధ్‌ అచ్చం అన్నయ్యలా ఉంటాడు. వాడు ఎప్పుడూ పప్పా.. పప్పా అని ఏడుస్తూ ఉన్నాడు. అత్తా.. మే పప్పాకే పాస్‌ జాతా హూ అంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’ అని సంతోష్‌బాబు సోదరి శృతి ‘సాక్షి’తో చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

మరిన్ని వార్తలు