డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం.. బంజారాహిల్స్‌లో స్థలం

22 Jul, 2020 15:33 IST|Sakshi

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల భారత్‌-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు.. ఆయన భార్యకు గ్రూప్‌ 1 ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్‌ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు. ఆమెకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్‌పెట్‌ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్‌ను కోరుకోవాలని కేసీఆర్‌ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్‌ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్‌ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్‌ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు