విచారణకు రండి..

5 Jul, 2015 01:40 IST|Sakshi
విచారణకు రండి..

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘ఓటుకు నోటు కేసు’లో సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణం చూపుతూ ఏసీబీ మొదటి నోటీస్‌కు సండ్ర విచారణకు హాజరుకాని విషయం విదితమే. అయితే ప్రస్తుత నోటీస్‌తో ఏసీబీ సండ్రను ఏం ప్రశ్నిస్తుంది?, ఆయన ఏం సమాధానం చెబుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది.  రెండోసారి నోటీసులు జారీ  హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ శనివారం నోటీసులు అంటించింది.

మొదటి నోటీసు జారీతోనే ఏసీబీ విచారణ తప్పదని భావించిన సండ్ర వారి ముందు ఏం చెప్పాలో సమాయత్తం  అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయ న రాజమండ్రిలో చికిత్స తీసుకుంటూ ఈ విషయమై పార్టీ అధినేతలు, న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలిసింది. తన ఆరోగ్యం కుదుటపడిందని, ఏసీబీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని సండ్ర తిరిగి లేఖ రాయడంతో ఆయనకు మరోదఫా నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం, ప్రస్తుతం సండ్రను ఏసీబీ విచారణకు పిలవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. సండ్ర విషయంలో ఏసీబీ ఎలా అడుగులు వేస్తుందోనని జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

 టీడీపీలో తీవ్ర ఉత్కంఠ
 రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఓవైపు ఏసీబీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం, అది తిరస్కరణకు గురికావడంతో సండ్ర విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. విచారణతోనే వదిలి పెడతారా..లేక అరెస్ట్ చేస్తారా..? అన్న విషయంపై టీడీపీ శ్రేణుల్లో కూడా టెన్షన్  మొదలైంది. గత రెండు రోజులుగా జిల్లాలోనే ఉన్న ఆయన సత్తుపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీబీ రెండోసారి నోటీసులతో ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని సండ్రతో చర్చించారు. ఏసీబీ విచారణతో సండ్ర భవితవ్యం ఏమవుతుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి.

 ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా
 ఏసీబీ రెండోసారి నోటీసుల విషయమై ‘సాక్షి’ తో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ‘ఏసీబీ ఇచ్చిన గడువులోగా విచారణకు హాజరవుతాను. ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాను. అనారోగ్య కారణంతోనే తొలివిడత విచారణకు హాజరుకాలేకపోయూను’ అన్నారు.

మరిన్ని వార్తలు