ఉత్కంఠ  వీడింది!

19 Feb, 2019 09:50 IST|Sakshi

ఉమ్మడి పాలమూరు నుంచి ఇద్దరికి మంత్రి పదవులు 

వనపర్తి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు నిరంజన్‌ శ్రీనివాస్‌గౌడ్‌కు చోటు 

విధేయుడు, ఉద్యమ నేతకు స్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌  

నేడు ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం 

ఒకరు టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్‌ వెన్నంటే నడిచిన నేత.. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకుడు కావడంతో తొలిసారి కేబినెట్‌ హోదా పదవి దక్కింది.. ఈసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రివర్గంలో చోటు సాధించగలిగారు.. ఇక మరొకరు ఉద్యోగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యమ నేతగా ఎదిగి... స్వరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక తెలంగాణ ఏర్పడగానే అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఆ వెంటనే తొలిసారి.. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.. వీరిద్దరు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌.. వనపర్తి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వీరిద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో ఈసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా మంగళవారం వీరిద్దరూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 13 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇద్దరికి మంత్రులుగా కేసీఆర్‌ అవకాశం కల్పించగా.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే ఆయనకు మలి విడతలోనైనా.. మరేదైనా కేబినెట్‌ ర్యాంకు పదవైనా కట్టబెట్టొచ్చని తెలుస్తోంది.

సాక్షి, వనపర్తి: మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠ తొలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు చోటు దక్కింది. సీఎం కేసీఆర్‌ వీరిద్దరికి సోమవారం సాయంత్రం స్వయంగా ఫోన్‌ చేసి మంగళవారం ఉదయం 11.30 గంటలకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది. సీఎంగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్‌ అలీ 2018 డిసెంబర్‌ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినా మిగతా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. దీంతో అప్పటి నుంచి నేడు, రేపు అంటూ ప్రచారం సాగుతుండగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, మంగళవారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించడంతో పాటు ఉమ్మడి పాలమూరు నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. 

13 స్థానాల్లో గెలవడంతో... 
2018 సెప్టెంబర్‌ 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డిసెంబర్‌ 7వ తేదిన ఎన్నికలు జరగగా అదే నెల 11 వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాలను గెలుచుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేసినా టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. కేవలం కొల్లాపూర్‌ స్థానంలో మాత్రం కాంగ్రెస్‌ గెలిచి కేవలం ఉనికిని కాపాడుకోగలిగింది. అత్యధికంగా 13 స్థానాలు గెలవడం, పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులను ఆశించే వారు అధికమయ్యారు.  

లక్ష్మారెడ్డికి నిరాశే 
మొదటి నుంచి వనపర్తి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డికి కేసీఆర్‌ కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. కానీ సీఎం కేసీఆర్‌ తాజా కేబినెట్‌లో గత మంత్రివర్గంలో కొనసాగిన లక్ష్మారెడ్డికి స్థానం లభించలేదు. అయితే, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నా... ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో మరొకరికి చోటు ఉంటుందా, లేదా అన్న విషయమై వేచి చూడాల్సిందే. అయితే, లక్ష్మారెడ్డికి కేబినెట్‌ హోదాలో పదవి ఇస్తారని తెలుస్తోంది. 

కొత్త వారికే చోటు 
కేసీఆర్‌ రెండోసారి గెలిచాక ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరూ కొత్త వారికే మంత్రి పదవులు దక్కడం విశేషం. ఒకరు ఉద్యోగ సంఘాల నేతగా పేరొంది ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌ గౌడ్‌ కాగా.. మరొకరు సీఎంకు నమ్మిన బంటు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. గతంలో వీరిద్దరికి కూడా మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం లేదు. కానీ వారి విధేయత, నమ్మకం, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్‌ వీరిద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కించుకున్న వీరికి రానున్న పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. 

భారీ మెజార్టీ 
మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీవోస్‌ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగులరినీ సకల జనుల సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ సమయంలో చేసిన సమ్మె అప్పటి ప్రభుత్వాన్ని కదిలించింది. 2014 మార్చి నెలలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడంతో అప్పడే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 57,775 మెజార్టీతో గెలవడంతో శ్రీనివాస్‌గౌడ్‌ తప్పక మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించినట్లుగానే జరిగింది. 

మొదటి ప్రభుత్వంలోనే...
వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2001లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పా ర్టీని స్థాపించాలనే ఆలోచన చేసిన నుంచి ఆయన వెంటే నడిచారు. 2014 లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. లేదంటే కేసీఆర్‌ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్‌ రెడ్డికి మంత్రి పదవి దక్కేది. ప్రస్తుత ఎన్నికల్లో 51,685 ఓట్ల మెజార్టీతో గెలవడంతో నిరంజన్‌ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్‌ ఖాయమైంది.  

మంత్రుల ప్రొఫైల్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు