చిన్నారిపై కామెంట్‌..14 నెలల జైలు..!

26 Jul, 2019 01:05 IST|Sakshi

కామెంట్‌ చేస్తే కటకటాలే..!

పదేళ్ల చిన్నారిపై కామెంట్‌ చేసిన వారికి జైలు

చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌ : చిన్నారులపై జరిగే నేరాలనే కాదు.. వారిపై చేసే అనుచిత వ్యాఖ్యల్నీ న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని అనడానికి ఈ ఉదంతమే సాక్షి. పదేళ్ల చిన్నారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య చేసిన ఇద్దరిపై నమోదైన కేసును విచారించిన న్యాయస్థానం ఓ నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరొకరు పరారీలో ఉండటంతో అతడిపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.  

2013లో ఏం జరిగిందంటే.. 
వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని సామ్రాట్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలిక (10) కుటుంబం నివసిస్తోంది. దీనికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో కె.వెంకట్రామిరెడ్డి (41), అతడి స్నేహితుడు ఉండేవారు. వీరిద్దరూ సినీ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. 2013 నవంబర్‌ 3న దీపావళి నేపథ్యంలో ఆ బాలిక తమ ఇంటి ముందు టపాకాయలు కాలుస్తోంది. బాలికను చూస్తూ విచక్షణ కోల్పోయిన వారిద్దరూ ‘ఆ పిల్ల చూడు మస్తుగ ఉంది’ అని కామెంట్‌ చేశారు. ఇది విన్న బాలిక తండ్రి అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయనతో ఘర్షణకు దిగిన వారిద్దరూ ప్రాణాలు తీస్తామంటూ బెదిరించి జారుకున్నారు. ఇదిలా ఉండగా వారిద్దరూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని కొందరు చెప్పడంతో బాలిక తండ్రి, మరో వ్యక్తి కలిసి వెంకట్రామిరెడ్డి సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. విటుల మాదిరిగా ఫోన్‌ చేయగా లక్ష్మీనగర్‌ చౌరస్తాకి రమ్మని చెప్పాడు. అక్కడ బాలిక తండ్రిని చూసి వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికుల సాయంతో పట్టుకుని చితకబాదారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వీరిపై ఐపీసీలోని 509, 506లతో పాటు పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) యాక్ట్‌లోని 12 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా వెంకట్రామిరెడ్డిపై హాకా భవన్‌లోని చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు వేరుగా విచారణ జరిపింది. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ‘ఆ పిల్ల చూడు మస్తుగ ఉంది’అని అన్నందుకు పోక్సో యాక్ట్‌ కింద వెంకట్రామిరెడ్డిపై నేరం నిరూపణ కావడంతో దోషిగా ప్రకటించింది. అతడికి 14 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ ఫస్ట్‌ ఎంఎస్‌జే కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పు ఇచ్చారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకోవడానికి నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. కాగా, వ్యభిచారం కేసు నిరూపణ కాలేదు. ఈ తీర్పు చిన్నారులు, మహిళలు, యువతుల్ని అభ్యంతరకర కామెంట్లు చేస్తూ వేధించే వారికి ఓ హెచ్చరిక లాంటిదని అధికారులు వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు