నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల టార్గెట్‌

28 Mar, 2019 03:43 IST|Sakshi

వాణిజ్య పన్ను వసూళ్లలో తెలంగాణ దూకుడు  

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్ను శాఖ వసూళ్లలో తెలంగాణ దూసుకుపోతోంది. ఈ నెలలో ఇప్పటికే రూ. 1,070 కోట్లను వాణిజ్య పన్నుశాఖ వసూలు చేసేసింది. ఈ నాలుగురోజుల్లోనూ మరో రూ.300 కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఫోన్‌ ద్వారానే లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు 1,300 మంది సిబ్బందిని కేటాయించారు. పన్ను వసూళ్ల కోసం తమ శాఖ రూపొందించిన యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పలు డివిజన్లలో పన్ను వసూళ్లలో సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెప్పే అవకాశాన్ని కల్పించారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఆయన అభినందించారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 920 కోట్లు వసూళ్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయి వసూళ్లతో దేశంలోనే అత్యధికంగా వాణిజ్య పన్ను శాఖ ద్వారా ఆదాయాన్ని పొందిన రాష్ట్రంగా తెలంగాణ గౌరవం దక్కించుకుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ రాబడిని పెంచుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.  

>
మరిన్ని వార్తలు