హోలీకా ఇనామ్..!

28 Mar, 2016 03:03 IST|Sakshi
హోలీకా ఇనామ్..!

భైంసా చెక్‌పోస్టులో వ్యాపారుల నజరానాలు..
ఆర్థిక సంవత్సరం ముగింపులోనూ మారనితీరు
వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి బాగోతం


భైంసా : హోలీ పండుగ అందరినీ రంగుల్లో ముంచెత్తితే.. భైంసా పట్టణ సమీపంలోని వాణిజ్యపన్నుల శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బందిని మాత్రం నజరానాలతో తడిపేస్తోంది. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. దీంతో పట్టణసమీపంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు ఏర్పాటైంది. భైంసా పట్టణం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వరకు పన్నులు చెల్లించకుండా అధికారులతో ముందస్తుగా సమాచారం ఇచ్చి వాహనాలను దాటించడం ఇక్కడ ‘మామూలు’ వ్యవహారంగా మారింది.

అందుకే ఈ చెక్‌పోస్టులో పని చేసేందుకు అధికారులు, సిబ్బంది ఎక్కువ మక్కువ చూపుతుంటారు. గతంలో ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించినా అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇక్కడి అధికారులంతా బడా వ్యాపారుల కనుసన్నల్లోనే పని చేస్తుంటారనే ఆరోపణలున్నారుు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారులు కూడా వారికి నజరానాలు ప్రకటిస్తుంటారు. ప్రతియేటా దీపావళి, దసరా, హోలీ పర్వదినాలు వచ్చాయంటే వ్యాపారులే ముందుకు వస్తారు. ఇనామ్‌ల పేరిట చెక్‌పోస్టుల్లో పనిచేసే అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఈ హోలీ వేడుక కూడా కలిసి రావడంతో వ్యాపారులు అధికారులను మెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 ముగింపు నెల అయినప్పటికీ...
 మార్చి నెల అంటేనే ఆర్థిక సంవత్సరానికి ముగింపు. అలాంటి ఈ నెలలోనూ భైంసా వాణిజ్యపన్నుల కేంద్రంలో తనిఖీలు అంతగా జరగడంలేదని విమర్శలు ఉన్నాయి. ముగింపు నెలలోనూ హోలీ పండుగ కలిసి రావడంతో ఈ చెక్‌పోస్టు గుండా వాహనాలు దాటించే బడా వ్యాపారులంతా ఇనామ్‌లు పంపిస్తున్నారన్న విషయం బాహాటంగా చర్చకు వస్తోంది. ఇక్కడి పరిస్థితిపై, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తీరుపై తెలిసిన చర్యలు మాత్రంలేవు. పైగా పై అధికారులు కూడా ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. అధికారుల తీరు కాస్త ప్రభుత్వ ఖజానాకు గండి పడేలా చేస్తోంది.

ఏళ్లుగా ఇదేతంతు..
భైంసా పట్టణం మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలోనే వాహనాలు సరిహద్దు దాటి వస్తుంటాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పక్కాగా తనిఖీ చేస్తే అక్రమ వ్యాపారుల గుట్టు బట్టబయలవుతుంది. ఏళ్లుగా జాతీయ రహదారిపై భైంసా నుంచి వెళ్లేందుకు ప్రతి ఒక్కరికీ సులభమని తెలియడంతో వ్యాపారులంతా ఇటువైపే దృష్టి సారిస్తున్నారు. ముందస్తుగా స్థానిక చెక్‌పోస్టులో సమాచారం అందించి వాహనాలను యథేచ్ఛగా దాటిస్తున్నారు. వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేసి ఇక్కడ విధులు నిర్వహించే అధికారులను మచ్చిక చేసుకుని తమ పని కానిస్తున్నారు.  

 పోలీసుల తనిఖీలతో..
వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులను దాటి భైంసా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పట్టణ సీఐ రఘు ఇప్పటికే తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన గు ట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పట్టణ సీఐగా బాధ్యతలు తీసుకున్న వారం రో జుల్లోనే తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారుల అక్రమదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు మరింత దృష్టి సారిస్తే కల్తీ నూనె, అనుమతి పత్రాలు లేకుండా వచ్చే చక్కెర లారీలు చిక్కే అవకాశం ఉంది. పోలీసు అధికారి తనిఖీలతో ఈ విషయం బయటపడుతుంటే ఇక్కడ తనిఖీల్లో షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించే వాణిజ్యపన్నుల అధికారులు, సిబ్బందికి ఇలాంటివి కనిపించకపోవడం గమన్హారం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా