కమీషన్‌ బకాయి రూ.20 కోట్లు

24 Nov, 2019 09:21 IST|Sakshi

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బకాయి పడిన పౌర సరఫరాయల శాఖ

సకాలంలో నిధులు విడుదల చేయని ప్రభుత్వం 

కమీషన్‌ బకాయి చెల్లించాలని సంఘాల  వినతి

మోర్తాడ్‌ (బాల్కొండ): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కమీషన్‌ బకాయి అందాల్సి ఉంది. సహకార సంఘాలకు కమీషన్‌ బకాయి వసూలు కాకపోవడంతో సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజను వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గడచిన ఖరీఫ్, రబీ సీజను నెలల కమీషన్‌ ఇంతవరకు చెల్లించకపోవడంతో సంఘాలకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 87 సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. గడచిన ఖరీఫ్, రబీ సీజనులలో భారీ మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రతి క్వింటాలుకు నిర్ణయించిన మేరకు కమీషన్‌ను పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన సహకార సంఘాలకు ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ సీజను కమీషన్‌ ఆ సీజనులోనే చెల్లించాల్సి ఉంది.

కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు నిధులు కేటాయించకపోవడంతో కమీషన్‌ బకాయిలు పేరుకుపోయాయి. అనేక సహకార సంఘాలు కొనుగోలు కమీషన్‌ను సిబ్బంది జీత భత్యాలకు చెల్లిస్తున్నాయి. ఒక్కో సహకార సంఘంలో సిబ్బందికి నెలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఎరువుల విక్రయం ద్వారా లభించే లాభాన్ని సహకార సంఘాల నిర్వహణకు వినియోగిస్తుండగా కొనుగోలు కమీషన్‌ నుంచి సిబ్బందికి జీత భత్యాలను చెల్లిస్తున్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలంగా ఉన్నా కమీషన్‌ బకాయి పేరుకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క మోర్తాడ్‌ సహకార సంఘానికి రూ.30లక్షల కమీషన్‌ బకాయి అందాల్సి ఉంది. ఇలా జిల్లాలోని ప్రతి సహకార సంఘానికి ఎక్కువ మొత్తంలోనే కమీషన్‌ రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కమీషన్‌ సొమ్మును సహకార సంఘాలకు అందించాలని పలువురు కోరుతున్నారు.

కమీషన్‌ సొమ్ము కోసం ప్రతిపాదనలు పంపాం... 
సహకార సంఘాలకు కమీషన్‌ సొమ్ము మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాం. ఈ సీజను కొనుగోళ్లు ముగిసిపోయేలోపు కమీషన్‌ సొమ్ము మంజూరు అయ్యే అవకాశం ఉంది. – అభిషేక్‌ సింగ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా