వర్షాకాలంలోనూ ఉక్క‘కోత’

16 Aug, 2014 01:30 IST|Sakshi
వర్షాకాలంలోనూ ఉక్క‘కోత’
  •  గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
  • సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలోనూ నగరవాసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో వర్షాల సీజన్‌లోనూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో నీటినిల్వలు పడిపోవడంతో పాటు బొగ్గు కొరతతో ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు.

    డిమాండ్-సరఫరా మధ్య 500-700 మెగావాట్ల లోటు నమోదవుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజూ ఇళ్లకు ఆరు గంటల పాటు అధికారిక కోతలు అమలు చేస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజే పవర్ హాలీడే అమలు చేస్తున్నట్లు చెబుతున్నా.. అంతకుమించే కోతలు అమలవుతున్నాయి. తగిన సరఫరా లేకపోవడంతో అత్యవసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో రోజూ మధ్యాహ్నం రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు.

    గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 37.90 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ విద్యుత్ కనెక్షన్లు 30.90 లక్షలు, వాణిజ్య కనె క్షన్లు 5.50 లక్షలు, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు 40 వేలు, ప్రకటనలు, వీధి దీపాల కనెక్షన్లు 40 వేలకుపైనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 2300 మెగావాట్లు ఉం డగా, 1600-1700 మెగావాట్లకు మించి సరఫరా కావడం లేదు.

    దీనికి తోడు ఏటా కొత్తగా 10 శాతం కనెక్షన్లు పెరుగుతుండగా, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వినియోగం రెట్టింపవుతోంది. దీంతో ఏటా 10-12 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం నగరవాసుల అవసరాలు పూర్తిస్థాయిలో తీరాలంటే రోజుకు కనీసం 45-47 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, ప్రస్తుతం 39-40 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావట్లేదు.
     

మరిన్ని వార్తలు