రైతుల ఆత్మహత్యలపై కమిటీ వేయాలి: చాడ

13 Nov, 2014 03:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని ఏర్పాటుచేసి, వాటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.  బుధవారం మఖ్దూంభవన్‌లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లావెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కొరత విషయంలో ఏపీ, తెలంగాణల వాదనలపై కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ టీడీపీ సర్కార్‌కు పరోక్షమద్దతునిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

కేంద్రం జోక్యం చేసుకుని కరెంట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అఖిలపక్ష బృందాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి తీసుకెళ్లి విద్యుత్ కొరత నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.  భూపంపిణీలో ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్‌లో వామపక్షాలు భూపోరాటం చేయక తప్పదన్నారు.   వచ్చే మార్చి 7-10 తేదీల మధ్య ఖమ్మంలో సీపీఐ తెలంగాణ తొలి రాష్ట్రమహాసభలను నిర్వహిస్తున్నట్లు చాడ తెలియజేశారు.
 
 కోర్టులో లొంగిపోయిన చాడ
 భూ పోరాటంలో కేసు ఫలితం..వెంటనే బెయిల్ మంజూరు
 హుజూరాబాద్: భూపోరాటం కేసులో సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ర్ట కార్యవర్గసభ్యుడు మర్రి వెంకటస్వామి బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో లొంగిపోయారు. 2007లో హుజూరాబాద్‌లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకోగా, ఆ భూమిని పేదలకు పంచాలని ఆందోళన చేపట్టారు.  అప్పటి సీపీఐ శాసనసభాపక్ష నేత చాడ వెంకటరెడ్డి, అప్పటి పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి నేతృత్వంలో నిరసన తెలిపారు.
 
 
 ఈ క్రమంలో వీరిపై హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పుడు పోలీసులు కొందరిని కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో  బుధవారం చాడ వెంకటరెడ్డి, మర్రి వెంకటస్వామి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత వెంటనే వీరికి బెయిల్ మంజూరైంది. అనంతరం  వారు మాట్లాడుతూ.. భూములను ఆక్రమించిన పెద్దలపై కేసులు లేవని, పేదల కోసం పోరాడిన తమపై కేసులు నమోదు చేయడం  సమంజసమా అని ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు