అన్నీ ఆన్‌లైన్‌లోనే..!

2 Apr, 2018 01:59 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి ట్యూషన్‌ ఫీజుల వరకు..

ప్రవేశాల్లో చలానా చెల్లింపు విధానం రద్దు

వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలపై కమిటీ కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు లభించిన విద్యార్థులు ఇకపై ఫీజులను చలానా రూపంలో బ్యాంకుల చుట్టూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపడుతోంది. చలానా విధానాన్ని ఈ సారి పూర్తిగా తొలగించి రిజిస్ట్రేషన్‌ నుంచి మొ దలుకొని ట్యూషన్‌ ఫీజు వరకు ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాం కింగ్‌ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. 

ఇబ్బందులకు చెల్లు చీటీ 
ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్‌ తదితర ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లు పొందే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. సీట్లు కేటాయించే సమయంలో కనీస ఫీజున్న కాలేజీల్లో మినహా మిగతా కాలేజీల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు అదనపు ఫీజులను చలానా జనరేట్‌ చేసుకొని బ్యాంకులకు వెళ్లి చెల్లించాల్సి వచ్చేది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాని ఓసీ విద్యార్థులైతే మొత్తం ఫీజులను ఇలాగే చెల్లించేవారు. అలా మొదటి విడతలో సీటు వచ్చి ఫీజు చెల్లించిన విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎక్కువ ఫీజు ఉన్న మరో కాలేజీలో సీటు వస్తే అదనపు ఫీజును మళ్లీ బ్యాం కులకు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు రెండో విడతలో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీటు వస్తే.. ముందుగా చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అన్ని కౌన్సెలింగ్‌లు, ప్రవేశాలు పూర్తయ్యే వరకు ఆగాల్సి వస్తోంది. అంతేకాదు ఆ మిగతా మొత్తాన్ని తీసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. 

హైదరాబాద్‌ రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు 
ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను తొలగించడంతోపాటు అదనపు మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు విద్యార్థులు ఎవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఎక్కువ ఫీజున్న కాలేజీల్లో సీట్లు వస్తే అదనపు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెండు, మూడు విడతల్లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీల్లో సీటు వస్తే మొదటి విడతలో చెల్లించిన ఫీజులో రెండు, మూడు విడతల్లో సీటు వచ్చిన కాలేజీ ఫీజు పోగా మిగతా మొత్తాన్ని ఆ విద్యార్థి ఆన్‌లైన్‌లో చెల్లించిన అకౌంట్‌కే తిరిగి వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా విద్యార్థులు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు