చితుకుతున్న చిన్న కాలేజీలు

29 Mar, 2018 03:44 IST|Sakshi

బడా కాలేజీలతో పోటీ పడలేకపోతున్నసాధారణ ప్రైవేటు కాలేజీలు

కార్పొరేట్‌ ఎత్తులు, ప్రచారం ముందు నిలదొక్కుకోలేక చిత్తు 

నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కాలేజీల మూత! 

2014లో 2,560 ప్రైవేటు కాలేజీలు

 2017లో 1,842కు తగ్గిన సంఖ్య 

ఈ ఏడాది అఫిలియేషన్‌కు వచ్చినవి 1,684 కాలేజీలే

సాక్షి, హైదరాబాద్‌: 2014–15లో రాష్ట్రంలో 2,560 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుండేవి.. 2015–16 వాటి సంఖ్య 2,259కి తగ్గిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 301 కాలేజీలు మూత పడ్డాయి! 2016–17 విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 1,842కు తగ్గింది. ఏకంగా 417 కాలేజీలు మూతపడ్డాయి. 2017–18 విద్యా సంవత్సరం నాటికి 1,733కు తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. ఈసారి కూడా పెద్దసంఖ్యలో ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితే కనిపిస్తోంది. కార్పొరేట్‌ కాలేజీలతో పోటీ పడలేకపోవడమే ఇందుకు కారణం. 

నాలుగేళ్లలో 827 కాలేజీలు.. 
ఆకర్షణీయ ప్రకటనలు, ర్యాంకుల ప్రచార హోరులో సాధారణ ప్రైవేటు కాలేజీలు బడా కార్పొరేట్‌ కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఆ సంస్థల దెబ్బకు మూత పడుతున్నాయి. నాలుగేళ్లలో 827 కాలేజీలు మూతపడినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం మరిన్ని మూతపడే పరిస్థితి నెలకొంది. కొంత ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులంతా కార్పొరేట్‌ కాలేజీలు ప్రచారం చేసే ఎంసెట్, జేఈఈ, ఐఐటీ ర్యాంకుల ఆకర్షణకు లోనై లక్షలు వెచ్చించి పిల్లలను వాటిల్లో చేర్చుతున్నారు. ఐఐటీ ర్యాంకుల కోసం అప్పులు చేసి మరీ కార్పొరేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రచార హోరును తట్టుకోలేక, పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించలేక సాధారణ, చిన్న గ్రామీణ కాలేజీలు క్రమంగా మూత పడుతున్నాయి. 

కార్పొరేట్‌ కాలేజీల కోసం పీఆర్వోలు 
కార్పొరేట్‌ వ్యవస్థలో విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్తగా పీఆర్‌వో విభాగం మొదలైంది. పట్టణాల వారీగా పీఆర్‌వోలను నియమించుకుంటున్నాయి. ఈ పీఆర్‌వోలు పదో తరగతి పరీక్షలకు ముందే ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరించి నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడి కాలేజీల్లో చేర్పించేలా ఒప్పిస్తున్నారు. ఐఐటీ, నిట్‌ విద్యాసంస్థల మోజులో ఉన్న తల్లిదండ్రులు ఆ కార్పొరేట్‌ కాలేజీల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా చూసుకోకుండా పిల్లల్ని చేరుస్తున్నారు. వారి ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు అనుమతులు తీసుకోకుండానే కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ.. ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతున్నాయి. దీంతో కార్పొరేట్‌ దందా ఏటే పెరిగిపోతూనే ఉంది.

వాటిల్లో ఎన్నో లోపాలు: ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల తనిఖీల్లో కార్పొరేట్‌ కాలేజీల లోపాలు అనేకం బయటపడ్డాయి. రాష్ట్రంలో కార్పొరేట్‌ సంస్థలకు చెందిన 146 కాలేజీల హాస్టళ్లు (రంగారెడ్డిలో 35, మేడ్చెల్‌లో 51, హైదరాబాద్‌లో 60) జైళ్లలా ఉన్నాయని తనిఖీల్లో తేల్చారు. ఆయా కాలేజీలు, హాస్టళ్లలో అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు చేయడం లేదు. సమయపాలన లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో చదివిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. 

ఈసారి మిగిలేవెన్నో... 
2018–19 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,684 కాలేజీలు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నా అందులో 760 కాలేజీలు ఇంకా ఫీజు చెల్లించలేదు. 924 ప్రైవేటు కాలేజీలే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించాయి. ఆలస్య రుసుంతో ఈ నెల 20 వరకే గడువు ముగిసింది. ఇపుడు ఫీజు చెల్లించని ఆ 760 కాలేజీల పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. అందులో 350 కాలేజీలకు పక్కా భవనాలు లేవని ఇదివరకే ఇంటర్‌ బోర్డు తనిఖీల్లో వెల్లడైంది. అవన్నీ రేకుల షెడ్డుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నవంబర్‌ వరకు కొనసాగింది. దీంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందుల్లో పడతారన్న ఉద్దేశంతో.. ఆ కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈసారి మాత్రం ఇచ్చేది లేదని డిసెంబర్‌లోనే స్పష్టం చేసింది. దీంతో ఆ 350 కాలేజీలు ఆన్‌లైన్‌ అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసినా.. వాటిలోని విద్యార్థులు కార్పొరేట్‌ కాలేజీలకు వెళ్లిపోతుండటంతో ఫీజును చెల్లించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆ కాలేజీలు మూత పడే పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు