పాతబస్తీలో ఘర్షణలు

15 May, 2014 01:40 IST|Sakshi
పాతబస్తీలో ఘర్షణలు
  • కిషన్‌బాగ్‌లోని సిక్ చావ్నీలో జెండా విషయమై వివాదం
  •   ఇరువర్గాల పరస్పర దాడులు.. రాళ్లు, కత్తులతో చెలరేగిన అల్లరి మూకలు
  •   పరిస్థితి విషమించడంతో కాల్పులు జరిపిన బీఎస్‌ఎఫ్
  •   ముగ్గురు మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం
  •   ఘర్షణల్లో 28 మందికి గాయాలు.. మూడు ఇళ్లు దహనం.. 
  •   50 వాహనాలు ధ్వంసం 
  •   సిక్ చావ్నీలో కర్ఫ్యూ... పాతబస్తీలో 144 సెక్షన్ అమలు
  •   సంయమనం పాటించాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి
  •  
     సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పాతబస్తీ సిక్ చావ్నీలో ఒక జెండా విషయమై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. వాగ్వాదం నుంచి మొదలై రాళ్లు, కత్తులతో దాడుల వరకూ వెళ్లింది. రెచ్చిపోయిన అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, ఇళ్లనూ తగులబెట్టాయి. పరిస్థితులు పూర్తిగా విషమిస్తుండడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తలెత్తిన కిషన్‌బాగ్ సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దీనికితోడు పాతబస్తీ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ విధించారు.
     
     హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సిక్ చావ్నీలోని హర్షమహల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఓ వర్గం వారు కొన్నేళ్ల క్రితం పవిత్ర జెండా దిమ్మెను నిర్మించుకున్నారు. పర్వదినాల్లో అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇక్కడి జెండాలను దహనం చేశారు. ఆ జెండాగద్దెని నిర్మించిన వర్గం వారు జెండాల దహనం విషయాన్ని తెలుసుకుని.. బుధవారం ఉదయం 6 గంటలకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.. ఇది తెలిసిన మరో వర్గం వారు కూడా భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్‌స్పెక్టర్ కుషాల్కర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా దిమ్మెపై కొత్త జెండాను ఏర్పాటు చేశారు. కానీ, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో.. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శంషాబాద్, మాదాపూర్ డీసీపీలు రమేష్‌నాయుడు, క్రాంతిరాణాలు సిక్ చావ్నీకి చేరుకుని ఇరువర్గాలకూ సర్దిచెప్పేందుకు దాదాపు గంట పాటు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. మరింత విషమించి ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. కనబడిన వాహనాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఇళ్లు దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన వారితో పాటు ఎనిమిది మంది పోలీసులూ గాయపడ్డారు. చివరికి పరిస్థితిని అదుపుచేసేందుకు బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. బుల్లెట్ గాయాలైన మరో తొమ్మిది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు హుటాహుటిన అదనపు బలగాలను మోహరించారు. సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. పాతబస్తీ ఉన్న దక్షిణ మండలంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. కాగా, పాతబస్తీలోని పరిస్థితులను గవర్నర్ నరసింహన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్ చావ్నీలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, బాధ్యులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరించారు. పుకార్లను నమ్మవద్దని, పూర్తిగా సంయమనం పాటించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
     
     అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
     
     సాక్షి, హైదరాబాద్, అనంతపురం: హైదరాబాద్‌లో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లను అదుపు చేయడానికే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ సిక్‌చావ్నీలో జరిగిన ఘర్షణలపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షించారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్‌చావ్నీలో ఇరు వర్గాల మధ్య దీర్ఘకాలంగా విద్వేషాలున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రతలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని ఆయన అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది.
     
     
     
     
మరిన్ని వార్తలు