సమాజ శ్రేయస్సే మీడియా లక్ష్యం

6 May, 2018 03:05 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గడ్కరీ. చిత్రంలో దత్తాత్రేయ, కె.లక్ష్మణ్‌

‘విజయక్రాంతి’ ఆవిష్కరణ సభలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

సాక్షి, హైదరాబాద్‌: సమాజ శ్రేయస్సు, భావి తరాల ప్రగతి మీడియాకు అంతిమ లక్ష్యంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆకాం క్షించారు. ప్రముఖ వ్యాపారవేత్త సి.ఎల్‌. రాజం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న ‘విజయక్రాంతి’దినపత్రికను హైదరాబాద్‌లో ని ఒక హోటల్‌లో శనివారం ఆయన ఆవిష్క రించారు. కార్యక్రమంలో గడ్కరీ సతీమణి కాంచన గడ్కరీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారా యణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సాంకేతికరంగం వంటి ఎన్నో అంశాల్లో అభివృద్ధికి మీడియా పనిచే యాల్సి ఉందన్నారు.

రాజకీయాలు ఒక్కటే మీడియా లక్ష్యం కాకూడదని, మిగిలిన చాలా అంశాల్లో ప్రగతి కోసం కృషి చేయాలన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడటానికి నిర్భయంగా, నిష్పక్షపాతంగా కొత్తపత్రిక వార్తలు రాయాలని కోరారు. పత్రికల ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి అవుతోంద న్నారు. దీనివల్ల దేశీయ మారకం విదేశాలకు తరలిపోవడంతోపాటు పత్రిక నిర్వహణ ఆర్థికభారంగా మారుతోందన్నారు. 

అనుకూలంగా రాసినవారికే ప్రకటనలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ చిన్న రాష్ట్రం లో ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ అనుకూలంగా రాసిన వారికి ప్రభుత్వ ప్రకటనలిస్తూ, ఇవ్వనివారిని బెదిరిస్తూ అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆరోపిం చారు. అధికారంలో ఉన్నవారి బెదిరింపులకు మీడియా కూడా అనివార్యంగా లొంగిపోయి, ఏకపక్షంగా వార్తలు రాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో మీడియాపై నిర్బంధం
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ మీడియాపై తీవ్రమైన నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రకటనలను నిలిపేయడం, ఇతర బెదిరింపులతో మీడియాను ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రిస్తోందని ఆరోపించారు. ఏ పత్రికలో ఏ వార్త రాయాలో ముఖ్యమంత్రి కార్యాల యమే ఆదేశిస్తోందని కోదండరాం ఆరోపించారు. విజయక్రాంతి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.ఎల్‌.రాజం మాట్లాడుతూ రాజకీయ పార్టీల కోసం కాకుండా ప్రజలు, ప్రజల కోసం పనిచేసే నాయకుల అండతో పత్రికను నడిపిస్తానని రాజం ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా