కాంతులనీ భ్రాంతే

19 Jul, 2014 00:04 IST|Sakshi
కాంతులనీ భ్రాంతే

పరిశ్రమల స్థాపనేదీ?        
 ఏడేళ్లయినా నత్తనడకే..
 నిబంధనలకు తిలోదకాలు    
 స్థలాన్ని లీజుకు ఇస్తున్న కంపెనీలు!
 అయినా చర్యలు శూన్యం        
 ఉపాధిలేదు.. భూమి లేదు
 నీరుగారుతున్న లక్ష్యం
 
 అంత ఉపాధి..ఇంత లాభం..జీవనరూపురేఖలే మారిపోతాయి..అని గత పాలకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పనంగా కట్టబెట్టారు. ఏడేళ్లు గడిచింది. ఒక్కసారి సమీక్షిస్తే కాంతులన్నీ భ్రాంతియేనని తేలింది. 60 పరిశ్రమల కోసం స్థలం కేటాయిస్తే కేవలం 14 మాత్రమే ఏర్పాటయ్యాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు తిలోదకాలు పలికాయి.
 
 వాటికి కేటాయించిన స్థలాన్ని ఇతర కంపెనీలకు లీజుకు ఇస్తున్నాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. జీవనోపాధి దొరుకుతుందనుకున్న స్థానికుల ఆశలు ఆవిరయ్యాయి. ఉన్న భూమి పాయే.. ఉద్యోగం దొరక దాయే అని ఆవేద న చెందుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశ్రమల స్థాపన కూడా జరుగకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఇవన్నీ ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు లో వెలుగుచూశాయి.
 
 గజ్వేల్: నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, కూచారం గ్రామాల్లోని పేదల భూములపై ఏపీఐఐసీ దృష్టి పడింది. ఆయా గ్రామాల్లోని 148, 354, 355, 342 సర్వే నెంబర్లలో పరిశ్రమల స్థాపన కోసం 820 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతు ల వద్ద 2006లో సేకరించింది. ఆయా గ్రామాల్లో ‘రియల్’భూం ప్రకారం ఎకరా రూ. 60 లక్షలకుపైగానే పలుకుతుండగా ఏపీఐఐసీ మాత్రం ఎకరాకు కేవలం రూ. 5లక్ష లు మాత్రమే పరిహారంగా చెల్లించి భూములను స్వాధీ నం చేసుకున్నది.

భూముల స్వాధీన ప్రక్రియ సందర్భం గా నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ సైతం ఇచ్చారు. ఇలా సేకరించిన భూమిని ఏపీఐఐసీ 60 సంస్థలకు పరిశ్రమల స్థాపన కొరకు రూ. 5లక్షల నుండి ఆపైన ధరకు ధారాదత్తం చేసింది. ఈ 60 పరిశ్రమల ద్వారా సుమారు రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఆశించారు. కానీ ఇందులో 25శాతం పెట్టుబడులు కూడా ఇంకా రాకపోవడం ఆందోళనకరం.
 
 60 పరిశ్రమల స్థాపన పూర్తయితే ప్రత్యక్షంగా సుమారు 10వేలు, పరోక్షంగా మరో 10వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్సయింది. భూముల సేకరణ ప్రక్రియ పూర్తయి ఏడేళ్లు కావస్తున్నా కేవలం ఇప్పటి వరకు సుమారు 14 పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో ఆరు ఇటీవలే పూర్తయ్యాయి. మిగతా పరిశ్రమల వ్యవహారం చడీచప్పుడు లేకుండా తయారైంది. ఫలితంగా 20 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన లక్ష్యం నీరుగారిపోతోంది.
 
 ములుగు మండలంలో....
 ములుగు మండలం బయెటెక్ కంపెనీల స్థాపన కో సం ఆ మండలంలోని కర్కపట్లలోని 321 సర్వే నెంబర్‌లో ఏపీఐఐసీ 521ఎకరాల పేదల భూములను సేకరించింది. దామరకుంట లోని 440 సర్వే నెంబర్‌లోని 120 ఎకరాలను సైతం సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 32 సంస్థలకుపైగా పరిశ్రమల స్థాపన కోసం 400 ఎకరాలకుపైగా కేటాయించారు. వీటిలో నాలుగు పరిశ్రమలు మాత్రమే  ఉత్పత్తిని ప్రా రంభించాయి. మిగతా పరిశ్రమల స్థాపన ప్రశ్నార్థకంగానే మిగిలి పోయింది. ఈ పరిశ్రమలు పూర్తయితే సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో 4వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించేది.
 
 నిబంధనలకు తూట్లు
 భూముల స్వాధీన ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండేళ్లలోపు పరిశ్రమలను స్థాపించకపోతే ఆ యజమానులకు నోటీసులు ఇచ్చి భూములను వాపస్ తీసుకోవాలనే ని బంధన ఉంది. అయినా ఏపీఐఐసీ మాత్రం పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తోంది. భూములు పొందిన యాజమాన్యాలు ప్రతియేటా ఏదో కారణం చూపుతూ అనుమతిని రెన్యూవల్ చేసుకుంటున్నాయి. ప్రధానంగా తూప్రాన్, ములుగు మండలాలు హెచ్‌ఎండీఏ(హైద్రాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోకి రావడం వల్ల పరిశ్రమల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్లో జాప్యం, విద్యుత్ కోతలు, గతంలో ఉద్యమాల ప్రభావం, బ్యాంకు రుణాలు వంటి కారణాలను యాజమాన్యాలు సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్నాయి.
 
 ఎంఎల్‌ఆర్ కంపెనీ భూమి స్వాధీనం...
 తూప్రాన్ మండలంలోని ఆటోమోటీవ్ పార్కులో ఎంఎల్‌ఆర్ కంపెనీ పరిశ్రమల స్థాపన కోసం 225 ఎకరాల భూమి పొందింది. తొలుత ఈ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, పరిశ్రమ స్థాపిం చగానే వేలాది మందికి ఉపా ధి అవకాశాలు లభిస్తాయని అంతా భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
 
  ఏడేళ్లుగా పరిశ్రమల స్థాపనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ కంపెనీ నుండి ఎట్టకేలకు ఇటీవల 100 ఎకరాలు, మరో రెండుమూడు కంపెనీల నుంచి కూడా సుమారు మరో 60ఎకరాల వరకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఏపీఐఐసీ సకాలంలో స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధితో కాళ్లకల్ భూనిర్వాసితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
 
 భూముల అమ్మకానికి యత్నం..?
 ఏపీఐఐసీ వద్ద అతితక్కువ ధరకు భూములను పొంది పరిశ్రమల స్థాపనలో విఫలమైన కంపెనీలు కొన్ని అక్రమంగా ఆ భూ ములను అధిక ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తూప్రాన్ మండలంలోని ఆటోమోటివ్ పార్కులో కొన్ని యాజమాన్యాలు ఇలాంటి ప్రయత్నానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. మరికొన్ని కంపెనీలు తాము పొందిన భూముల్లో కొంత భాగం పరిశ్రమ స్థాపించినట్లుగా పనులు చేపట్టి చాలా భాగం ఇతర కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
 
 
 కేసీఆర్‌పైనే ఆశలు...
 గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం, ములుగు మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసే దిశగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆశిస్తున్నారు.
 
 భూమి పోయి... ఉపాధి లేక...
 తూప్రాన్ మండలంలోని ఆటోమోటివ్ పార్కులో భూములను కోల్పోయిన సుమారు 400 మందికిపైగా నిర్వాసితులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. భూ సేకరణ సందర్భంగా వీరి కుటుంబంలో ఒకరి కంపెనీల్లో ఉద్యోగం ఇస్తామని, 200 గజాల స్థలంలో సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ఉపాధి కల్పన కోసం ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్న మాట కూడా నీటి మూటగానే మారింది. ములుగు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
 
 పనులు ప్రారంభించని పరిశ్రమలకు నోటీసులు...
 తూప్రాన్ మండలంలోని ఆటోమోటీవ్ పార్క్‌లో పనులు ప్రారంభించని సుమారు 40 పరిశ్రమలు, ములుగు మండలం కర్కపట్ల బయోటెక్ పార్క్‌లో పనులు ప్రారంభించని 28 సంస్థలకు ఇటీవల నోటీసులు జారీ చేశాం. ఇక ఆ సంస్థలను ఉపేక్షించేది లేదు. వారిచ్చే వివరణను ప్రభుత్వానికి నివేదించి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపడతాం.
 -ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వర్‌రావు
 
 రోడ్ల మీద తిరుగుతున్న..
 మా తండ్రి మల్లయ్య పేరిట ఉన్న మూడున్నర ఎకరాల భూమి పరిశ్రమల కోసం తీసుకుండ్రు. ఇందులో రెండెకరాలకు మాత్రమే రూ. 1 0లక్షలు పరిహారం ఇచ్చిండ్రు. మిగతా ఎకరంన్నర రికార్డుకు లేదని చేతులెత్తేసిండ్రు. భూమిపోయి, నష్టపరిహారం సరిగ్గా రాక ఎంతో నష్టపోయినం. ఇప్పుడు పనిలేక రోడ్లమీద తిరుగుతున్న. ఉద్యోగాలు ఇస్తమన్నరు. ఒక్కరు గూడ దానిగురించి పట్టించుకుంటలేదు.
 బొల్లబోయిన పెంటయ్య(కాళ్లకల్ భూనిర్వాసితుడు)
 
 అన్యాయం చేసిండ్రు...
 మా తండ్రి నర్సింహులు పేరుమీద ఉన్న రెండెకరాల భూమి తీసుకుండ్రు. అందులో ఎకరంన్నరకే రూ. 7.5లక్షల పరిహారం కట్టించిండ్రు. మిగతా అద్దెకరం రికార్డుకు లేక ఇయ్యమని చెప్పిండ్రు. భూమి పోయినందుకన్నా ఉద్యోగమొస్తదని అనుకున్నం. కానీ అన్యాయమైపోయినం.
 -నాగమల్లయ్య (కాళ్లకల్ భూనిర్వాసితుడు)
 
 బతుకులను ఆగం జేసిండ్రు...
 అరచేతిలో వైకుంఠం చూపిండ్రు. పెద్దపెద్ద పరిశ్రమలు వస్తయ్. మీకు ఉపాధికి డోక ఉండది. భూములియ్యుండ్రి అని నమ్మబలికిండ్రు. భూములిచ్చిన్నంక పట్టించుకోలేదు. -నర్సింహ( తూప్రాన్ భూనిర్వాసితులసంఘం అధ్యక్షుడు)


 

మరిన్ని వార్తలు