మారకుంటే డిస్మిస్సే..

23 Nov, 2018 17:44 IST|Sakshi
గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న జీఎం ఎస్‌డీఎం సుభాని (ఫైల్‌)

గైర్హాజరు కార్మికులపై యాజమాన్యం సీరియస్

చివరి సారిగా కౌన్సెలింగ్‌

3 నెలల గడువు

నిర్ణీత మస్టర్లు నింపాలని  ఆదేశాలు

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): ఉద్యోగాల లేక నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతుంటే ఉన్న ఉద్యోగాలను లెక్కచేయకుండా కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు కొందరు కార్మికులు. నిర్ణీత మస్టర్లు నింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంత మంది కార్మికులు డిస్మిస్‌ అంచులకు వెళ్లారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్‌. ఇంత పెద్ద ఏరియాలో గైర్హాజరు కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు నింపాలి. ఇలా మూడేళ్లు వరుసగా 100 మస్టర్లు నిండకుంటే వారిని కంపెనీ డిస్మిస్‌ చేస్తోంది. గతంలో వేలాది మంది కార్మికులు ఇలాగే డిస్మిస్‌ అయ్యారు. 2003 వరకు మూడేళ్లు చూసి వెంటనే డిస్మిస్‌ చేసింది.
కాలక్రమేణా వచ్చిన మార్పులతో చాలామంది డ్యూటీల బాటపట్టారు. కానీ ఇంకొందరు గైర్హాజరు అవుతూనే ఉన్నారు. వారి పట్ల యాజమాన్యం సీరియస్‌గా స్పందించాల్సి ఉన్పప్పటికీ కొత్త రాష్ట్రంలో డిస్మిస్‌ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, కౌన్సెలింగ్‌ పేరుతో డ్యూటీలు చేయాలని కోరుతూ వచ్చింది. గడిచిన ఐదేళ్లుగా కార్మికులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తూ రావడంతో ఇందులో కొంత సత్ఫలితాలు వచ్చింది. కాగా, ఏరియాలో గడిచిన 5 ఏళ్లుగా 100 మస్టర్ల కంటే తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారిపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు.
ఇంక్రిమెంట్‌లు కూడా కట్‌ చేసిన వారు మారడం లేదు. దీంతో వారికి చివరిసారిగా ఈ నెల 20న కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తీవ్ర గైర్హాజరు ఉన్న 38 మందిని గుర్తించి అధికారులు పిలిచారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్‌చేసి వారిని వెంట తీసుకొని కౌన్సెలింగ్‌కు రమ్మని కోరారు. ఇందులో కేవలం 17 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. వారికి చివరి సారిగా నోటీసులు ఇచ్చి చర్యలకు సిద్ధమైంది. వీరు డిస్మిస్‌ అయ్యేఅవకాశం కూడా ఉందని తెలుస్తుంది.
 
నెలకు 22 మస్టర్లు చేస్తే సరి
కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో చాలా మందికి యాజమాన్యం చివరి అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్, జనవరీ, ఫిబ్రవరిలో ప్రతీ నెల 22 మస్టర్లు తగ్గకుండా పనిచేయాలని జీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇలా 3 నెలలు పనిచేసి గాడిన పడాలని, ఈ 3 నెలల్లో కూడా మార్పు రాకుంటే వారిని డిస్మిస్‌ కోసం కార్పొరేట్‌కు సిఫార్సు చేయడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది.

వ్యసనాలతో చాలా మంది ఎగనామం
చాలా మంది గైర్హాజరు కార్మికులు వ్యసనాల కారణంగా డ్యూటీలు సక్రమంగా చేయకుండా గైర్హాజరు కార్మికులుగా మారారు. ఇందులో యువ కార్మికులు కూడా ఉండటం అశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబ బాధ్యత మరిచి జులాయి తిరుగుళ్లు తిరుగూ డ్యూటీలు రావడం లేదని ఇలాంటి వారిని ఇక ఉపేక్షించేది లేదని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా చివరి అవకాశంగా వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సేవా సమితి ద్వారా మహిళలు కూడా కార్మికుల కుటుంబాల్లోని మహిళలను పిలిచి వారి సమక్షంలో కార్మికునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి డ్యూటీలు సక్రమంగా చేసుకొని కుటుంబానికి పోషించుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి నాటికి వీరు మారకుంటే డిస్మిస్‌ కావడం ఖాయమని పేర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డుపై పడకుండా ఉద్యోగం నిలుపుకోవాల్సిన బాధ్యత సదరు కార్మికులపై ఉంది. 

మరిన్ని వార్తలు