తల‘సిరి’ గల నగరి

22 Jul, 2017 01:13 IST|Sakshi
తల‘సిరి’ గల నగరి

రాజధానివాసుల తలసరి ఆదాయం రూ.1.04 లక్షలు
రాష్ట్ర మానవాభివృద్ధి నివేదికలో వెల్లడి


‘భాగ్య’నగరి అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విద్య, వైద్యంతో పాటు తలసరి ఆదాయం గ్రాఫ్‌ ఎగబాకుతోంది. తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక–2017 ప్రకారం హైదరాబాద్‌లో తలసరి ఆదాయం ఏడాదికి రూ.1.04 లక్షలు. పక్కా భవనాలు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నవారు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అధికశాతం. ఈ తాజా నివేదిక ప్రకారం వివిధ అంశాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి పయనం ఇలావుంది...– సాక్షి, హైదరాబాద్‌

లక్షాధికారులే...
తెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌ తలసరి ఆదాయంలో అగ్ర స్థానంలో నిలిచింది. నగరవాసుల తలసరి ఆదాయం ఏడాదికి రూ.1,04,587 ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే. రంగారెడ్డి జిల్లాలో పురుషులు రూ.89,973, మహిళలు రూ.55,317 తలసరి ఆదాయం కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఆరోగ్య, విద్య సూచీల్లో టాప్‌.
ఆరోగ్యం, విద్య సూచీల్లో హైదరాబాద్‌ నగరం అగ్రభాగాన నిలిచింది. ఆరోగ్యం విషయంలో 0.888 పాయింట్లు సాధించి తెలంగాణ జిల్లాల్లో టాప్‌లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 0.733 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఇక విద్యాసూచీలో 0.774 పాయింట్లతో హైదరాబాద్‌ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా..0.546 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో ఉంది.

అక్షరాస్యతలోనూ అందలమే
అక్షరాస్యత విషయంలోనూ హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో 83.3 శాతం మంది అక్షరాస్యులున్నారు. ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లాలో 75.9 శాతం అక్షరాస్యత నమోదైంది.

ప్రైవేటు బడులూ అధికమే
హైదరాబాద్‌ జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా 71.6 శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. రెండో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 47 మాత్రమే.

ఆస్పత్రుల్లో ప్రసవాలు
ఆస్పత్రుల్లో సురక్షిత పరిసరాల్లో ప్రసవాల విషయంలో నగరం అగ్రభాగాన నిలిచింది. నగరంలో 97.2 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 95.3.

పాఠశాలలూ ఎక్కువే
ప్రతి 10 చదరపు మీటర్ల పరిధిలో హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 209.40 పాఠశాలలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 51.11 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది.  

పాఠశాలకు హాజరులో రంగారెడ్డి టాప్‌
అత్యధికంగా 99.1 శాతం మంది విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు హాజరవుతుండగా, హైదరాబాద్‌ 97.4 శాతంతో, నిజామాబాద్‌ జిల్లా తరువాత మూడో స్థానంలో ఉంది.

కలవరపరుస్తున్న మాతా, శిశు మరణాలు
నగరంలో ప్రతి వెయ్యిమంది శిశు జననాలకు 20 మంది.. రంగారెడ్డి జిల్లాలో 33 మంది పురుట్లోనే మృత్యువాతపడుతుండడం కలచివేస్తోంది. హైదరాబాద్‌లో ప్రతి లక్షమంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో 71 మంది... రంగారెడ్డిలో 78 మంది మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

సేవారంగ ఆదాయం అదుర్స్‌
నగరంలో సేవారంగం ద్వారా ఆదాయం అధికంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నిలయమైన భాగ్యనగరంలో సేవారంగం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ రంగంలో 2011–12 అంచనాల ప్రకారం రూ.78,755 కోట్ల ఆదాయం వస్తోంది. పరిశ్రమల ద్వారా రూ.14,898 కోట్లు, వ్యవసాయంలో రూ.1,055 కోట్లే లభిస్తోంది. రంగారెడ్డిలో సేవారంగంలో రూ.36,266 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.26,064 కోట్లు, వ్యవసా యంలో రూ.4,515 కోట్లు ఆదాయం వస్తోంది.


విద్య, వైద్య ఖర్చులు అధికమే
హైదరాబాద్‌లో తలసరి ఆదాయం లక్షకు మించినప్పటికీ విద్య, వైద్యం కోసం చేస్తున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయం ఏమూలకూ సరిపోవడంలేదు. వీటికి ప్రభుత్వ కేటాయింపులు పెరిగి అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించినపుడే మానవాభివృద్ధి సూచికలో మరింత పురోభివృద్ధి సాధ్యం.
– ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి, చేతన సొసైటీ

 

మరిన్ని వార్తలు