పట్టు ఉత్పత్తిలో చైనాతో పోటీపడదాం

4 Jul, 2018 02:43 IST|Sakshi
పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఆదివాసీలతో జూపల్లి నృత్యం

     పట్టు రైతుల అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి 

     మల్బరీ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: పట్టు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీపడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పట్టు రైతుల అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్‌ వెనకబడి రెండోస్థానంలో నిలిచిందన్నారు. అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌లతో పాటు భారత్‌ కూడా పట్టును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. పట్టు ఉత్పత్తులకు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. 

ఐదో స్థానంలో తెలంగాణ..  
సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని జూపల్లి సూచించారు. భారత్‌లో 45 వేల మెట్రిక్‌ టన్నుల పట్టుకు డిమాండ్‌ ఉంటే 31వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్‌ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. మనదేశంలో 9,571 మెట్రిక్‌ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 119 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో మల్బరీ సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఎకరం సాగుతో ఏడాదికి రూ.4 లక్షలు
ఒక ఎకరం మల్బరీ సాగు చేయడం వల్ల ఐదుగురికి ఏడాదంతా ఉపాధి కల్పించవచ్చునని, ఏడాదిలో 8 నుండి 10 పంటలు సాగు చేయవచ్చునని జూపల్లి చెప్పారు. ఎకరానికి దాదాపుగా రూ.4 లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశముందని వివరించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యానవన శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టు దారం–రైతు జీవనాధారం బుక్‌లెట్, సీడీని జూపల్లి ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు