టీఆర్‌ఎస్‌లో పోటా పోటీ

31 Dec, 2019 09:10 IST|Sakshi

అధికార పార్టీలో మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. వివిధ పార్టీల నుంచి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన ద్వితీయ శ్రేణి నాయకులు కౌన్సిలర్, చైర్మన్‌ స్థానాల్లో  బరిలోకి దిగేందుకు నువ్వా నేనా అనే విధంగా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. విపక్ష పార్టీల కంటే కేవలం అధికార పార్టీలోనే వివిధ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డునుంచి పోటీచేసేందుకు ఇద్దరు ముగ్గురు సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా ఎలాగైనా టికెట్లు దక్కించుకునేందుకు పార్టీలోని అగ్రనాయకుల వద్దకు తమ రాయబారాలు సాగిస్తున్నారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో పోటాపోటీ నెలకొంది.

సాక్షి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ మున్సిపాలిటీల వారీగా కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. వార్డులు, చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ తదితర పార్టీలకు ఆయా మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు సరిపడా అభ్యర్థులే దొరకని పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు అధికార పార్టీలో మాత్రం ఒక్కో వార్డులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ టికెట్లకు యమ గిరాకీ ఏర్పడింది. ఏడు మున్సిపాలిటీల్లోనూ ఇదే పోటీ పరిస్థితి కనిపిస్తోంది. 

నల్లగొండలో.. నల్లగొండ మున్సిపాలిటీలో ఇదివరకు 40 వార్డులు ఉండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 48కి పెరిగింది. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు మాత్రమే కౌన్సిలర్లుగా గెలుపొందారు. ప్రస్తుతం 48 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కనీసం 15 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు ఆ పైన టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వార్డుల్లో టికెట్‌ దక్కని వారు రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచనలు కూడా చేస్తున్నారు. మరో వైపు ఆ పార్టీలో చైర్మన్‌ పోస్టుకు డిమాండ్‌ బాగా కనిపిస్తోంది. మాజీ కౌన్సిలర్లు అబ్బగోని రమేష్‌ గౌడ్, పిల్లి రామరాజు, మిర్యాల యాదగిరి, పార్టీ నాయకులు బోయపల్లి కృష్ణారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, యామ దయాకర్‌ వంటి వారు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ వర్గాల సమాచారం.

మిర్యాలగూడలో.. మున్సిపాలిటీలో గతంలో ఎన్నికలు జరిగిన 36 వార్డులలో 28 వార్డులలో టీఆర్‌ఎస్‌ మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరందరికీ మళ్లీ టికెట్లు కేటాయిస్తామని స్థానిక ఎమ్మెలే భాస్కర్‌రావు హామీ ఇవ్వడం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి వార్డుల సంఖ్య 48కి పెరగడంతో కొత్తవారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, కొన్ని వార్డుల్లో నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. మున్సిపల్‌ తాజా మాజీ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మి భర్త తిరునగరు భార్గవ్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నాగార్జున సాగర్‌లో.. నియోజకవర్గంలో నూతనంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హాలి యా మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీలో కనీసం ఎనిమిది మంది పోటీ పడుతుండడంతో ఇక్కడి రాజకీయం వేడెక్కింది. మలిగిరెడ్డి లింగారెడ్డి, నోముల భగత్‌యాదవ్, కొమ్మన బోయిన చంద్రశేఖర్‌గౌడ్, చెరుపల్లి ముత్యాలు, చాపల సైదులు, నల్లబోతు వెంకటయ్య, మన్నె రామలింగయ్య యాదవ్, బందిలి సైదులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక నందికొండ మున్సిపాలిటీలో బొల్లెపల్లి శ్రీనివాసరావు, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, కర్ణా బ్రహ్మానందరెడ్డి, ప్రభాకర్‌రావు, బత్తుల సత్యనారాయణ, ఈర్ల రామకృష్ణ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దేవరకొండలో.. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డు నుండి ముగ్గురి నుండి నలుగురి వరకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు పోటీ పడుతున్నారు. చైర్మన్‌ స్థానానికి రిజర్వేషన్‌ ఇంకా ఖరారు కాలేదు. అయినా ఎస్టీ, బీసీ, జనరల్‌ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పోటీ పడనున్నారు. చైర్మన్‌ స్థానం ఎస్టీకి రిజర్వు అయితే మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్త్య దేవేందర్, బీసీలకు రిజర్వ్‌ అయితే హన్మంతు వెంకటేష్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, పున్న వెంకటేశ్వర్లు, జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయితే మాజీ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహులు పోటీ పడుతున్నారు. 

చిట్యాలలో.. మున్సిపాలిటీలోని 12కౌన్సిలర్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మండలానికి చెందిన శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి మద్దతుతో వారి అనుచరులు కౌన్సిలర్‌ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టికెట్ల కేటాయింపులో తన అనుచరులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చూ స్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన మూడురోజుల క్రితం చిట్యా లలో కౌన్సిలర్‌ అభ్యర్థుల జాబితాను తయారు చేసుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే  వీరేశం అనుచరులు ఇద్దరు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కకుంటే ఇండిపెండెంట్‌గా లే దా కలిసి వచ్చే పార్టీలతో ఓ ప్యానల్‌ ఏర్పాటు చేసి పోటీచేయాలనుకుంటున్నారని సమాచారం. 

చండూరులో.. చండూరు మున్సిపాలిటీలో పది వార్డులకు పోటీ బాగానే ఉంది. కోడి వెంకన్న, కలిమికొండ జనార్దన్‌లు చైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. కౌన్సిలర్‌ స్థానం కోసం ఒక్కో వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు రేసులో ఉన్నారు.  

మరిన్ని వార్తలు