శ్రీశైలం ఖాళీ.. సాగర్‌పై గురి!

3 May, 2017 01:50 IST|Sakshi
శ్రీశైలం ఖాళీ.. సాగర్‌పై గురి!

785 అడుగుల మట్టం వరకు శ్రీశైలం నీటి వినియోగం పూర్తి
► ఇప్పుడు సాగర్‌ నీటి కోసం పోటాపోటీ
► కుడి కాల్వను వివాదాస్పదం చేసేందుకు ఏపీ యత్నం
► రాష్ట్ర అధికారులపై కేసుల నమోదులో బోర్డు జోక్యం కోరిన తెలంగాణ


సాక్షి, హైదరాబాద్‌: వేసవి మధ్యలోనే కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు ఖాళీ కావడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వేడి పుట్టిస్తోంది. అవసరమైన మేర నీటి నిల్వలు లేకపో వడంతో... ఉన్న నీటికోసం తెలుగు రాష్ట్రాలు గుంజులాడుకుంటున్నాయి. గతంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన కనీసమట్టాల మేర కు.. ఇప్పటికే శ్రీశైలం కోటా (785 అడుగుల వరకు) పూర్తయింది. నాగార్జునసాగర్‌లో మాత్రం మరో రెండు అడుగుల (కనీస మట్టం 503 అడుగులు) వరకు నీటిని తీసుకునే అవకాశం ఉండటంతో.. ఆ నీటికోసం ఇరు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

ఉన్న కొద్దినీటినే..
ఫిబ్రవరిలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 78 టీఎంసీల నుంచి బోర్డు ఏపీకి 47 టీఎంసీలు, తెలంగాణకు 31 టీఎంసీలు పంచింది. అందులో తెలంగాణ వాటా ఇప్పటికే పూర్తికాగా.. ఏపీకి మరో 5 టీఎంసీలు రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 785 అడుగుల కనీస మట్టం వరకు నీటి వినియోగం పూర్తయింది. సాగర్‌లో ప్రస్తుతం 504.9 అడుగుల మేర జలాలు ఉన్నాయి. అంటే కనీసమట్టానికి పైన రెండు అడుగుల మేర 3.25 టీఎంసీల లభ్యత జలాలు ఉన్నాయి. ఇప్పుడీ నీటి కోసమే ఇరు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. 504 అడుగుల కన్నా దిగువకు తగ్గితే హైదరాబాద్‌ తాగునీటికి ఇబ్బంది ఉంటుందన్న కారణంగా తెలంగాణ నీటిని విడుదల చేయడం లేదు.

అంతేగాకుండా కుడి కాల్వ కింద వాటా మేరకు నీటి విడుదల పూర్తయిందని చెబుతోంది. కానీ ఏపీ దీనిని అంగీకరించడం లేదు. బోర్డు ఆదేశాలను చూపుతూ నీటి విడుదల కోసం పట్టుబడుతోంది. తెలంగాణ అధికారులపై పోలీసు కేసులు కూడా నమోదు చేసింది. అయితే కుడి కాల్వ అంశాన్ని వివాదాస్పదం చేసి దాన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చేలా ఏపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే పోలీసు కేసులు పెడుతున్నారని తెలంగాణ అనుమానిస్తోంది. వాస్తవానికి సాగర్‌ కుడి కాల్వ కృష్ణా బోర్డు నియంత్రణలో ఉండాలని, అలాగైతేనే తమకు నీటి విడుదల సులభమని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. కానీ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది.

బోర్డు జోక్యం చేసుకోవాలి
రాష్ట్ర అధికారులపై ఏపీ అధికారులు పెట్టిన పోలీసు కేసుల విషయంలో కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ సోమవారం రాత్రి బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. సాగర్‌ కుడి కాల్వ కింద ఏపీకి వివిధ సందర్భాల్లో 22.59 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారని.. అందులో సరఫరా నష్టాలు 2.52 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 1.67 టీఎంసీ లతో కలిపి 22.69 టీఎంసీలు విడుదల చేశామని ఆ లేఖలో వివరించారు.

బోర్డు ఆదే శాల మేరకు వాటా పూర్తయినందునే తెలం గాణ అధికారులు నీటి విడుదల నిలిపి వేశా రని స్పష్టం చేశారు. అయినా ఏపీ అధికారు లు ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించా రని, తెలంగాణ అధికారులపై కేసు లు నమో దు చేశారని తెలిపారు. ఈ విష యంలో బోర్డు జోక్యం చేసుకుని ఏపీకి సహేతుక సూచనలు చేయాలని విన్నవించారు.

>
మరిన్ని వార్తలు