బీజేపీ అధ్యక్ష పదవికి  నేనంటే నేనే..

25 Feb, 2020 03:34 IST|Sakshi

తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని పరిశీలకులకు చెప్పుకున్న నేతలు

కోర్‌ కమిటీ సభ్యులు, పదాధికారులతో పరిశీలకుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌ జైన్, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పాండ సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 39 మంది నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందో చెప్పాలని పరిశీలకులు నేతలకు సూచించారు. ప్రతి ఒక్కరితో వన్‌ టు వన్‌గా మాట్లాడి అభిప్రాయాలను స్వీకరించారు. 39 మందిలో 10 మంది నేతలు తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అబ్జర్వర్లకు చెప్పుకున్నారు. అయితే అబ్జర్వర్లు మీరు కాకుండా అధ్యక్షుడిగా ఇంకా ఎవరి పేరునైనా ప్రత్యామ్నాయంగా ప్రపోజ్‌ చేయాలని సూచించడంతో వారు కంగుతిన్నట్లు తెలిసింది.

తమకే అవకాశం ఇవ్వాలన్న వారిలో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఎంపీ అరవింద్‌ తదితరులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలోని కోర్‌ కమిటీ నేతలతోపాటు కొంత మంది వైస్‌ ప్రెసిడెంట్లు, మరికొంత మంది అధికార ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొంత మంది రాష్ట్ర పార్టీలో మార్పు అవసరమని పేర్కొనగా, కొంత మంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది.  

అధ్యక్షుడి మార్పు జరగాల్సిందే..
మెజారిటీ నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే పాత వాళ్లకు ఇస్తారా? లేదా కొత్త వాళ్లకు ఇస్తారా? అనే దానిపై అభిప్రాయ సేకరణకు వచ్చిన నేతలు విషయాన్ని బయటకు చెప్పలేదు. మరోవైపు సీనియర్‌ నేతలు మాత్రం అభిప్రాయ సేకరణ విషయంలో కోర్‌ కమిటీ అభిప్రాయానికే పరిమితం కాకూడదని, గ్రౌండ్‌ లెవల్‌లో నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకొని నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాలని అబ్జర్వర్లకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

పార్టీలోనే ఉంటూ కీలకంగా మారిన ఒకరిద్దరు నేతలు అభిప్రాయ సేకరణలో పాల్గొనే నేతల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల కోర్‌ కమిటీలో కొత్తగా నియమితులైన వారి పేర్లే జాబితాలో ఉన్నాయని, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు