రక్షణలో స్వావలంబనకు ‘డేర్‌ టు డ్రీమ్‌’!

20 Jan, 2019 01:20 IST|Sakshi
సదస్సులో కరచాలనం చేసుకుంటున్న డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, ఆర్‌.ఎన్‌.రవి

కొత్త టెక్నాలజీల కోసం పోటీ నిర్వహిస్తున్నాం

డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి వెల్లడి

రక్షణ తయారీ రంగంపై హైదరాబాద్‌లో రెండ్రోజుల సదస్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రక్షణ రంగంలో భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక టెక్నాలజీల అవసరం ఎంతైనా ఉందని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి టెక్నాలజీలను దేశీయంగానే సంపాదించుకునేందుకు యువ శాస్త్రవేత్తలను, స్టార్టప్‌ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రేపటితరం టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు డీఆర్‌డీవో ‘డేర్‌ టు డ్రీమ్‌’పేరుతో పోటీని నిర్వహిస్తోందని తెలిపారు. కృత్రిమ మేధతోపాటు డ్రోన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, స్మార్ట్‌ మెటీరియల్స్‌ వంటి రంగాల్లో అత్యంత ప్రభావశీల, వినూత్న ఆలోచనలు, టెక్నాలజీలతో ముందుకు వచ్చే వారిని ఈ పోటీ ద్వారా గుర్తిస్తామని వివరించారు. స్టార్టప్‌ కంపెనీలతోపాటు వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చునని, వచ్చే నెలలో పోటీ గడువు ముగుస్తుందని వివరించారు.

రక్షణ తయారీ రంగంలో స్వావలంబన అనే అంశంపై ఫోరం ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సుకు డాక్టర్‌ సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ సెక్యూరిటీ, ఏవియేషన్, రొబోటిక్స్‌ రంగాల్లో వస్తున్న మార్పులతో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయన్నారు. అందుకు తగ్గట్లుగా భారత్‌ కూడా తగిన శక్తియుక్తులను సమకూర్చుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. రక్షణ రంగంలో అన్ని రకాల శక్తిసామర్థ్యాలను దేశం కలిగి ఉందని, ఇదే క్రమంలో ఈ రంగంలో స్వాలంబన అనేది ముఖ్యమన్నారు. ఆ దిశగా మరిన్ని పరిశోధనలు జరిపి అధునాతన ఆయుధాలను మన దేశంలోనే తయారు చేసుకునే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా సాంకేతికత రూపుదిద్దుకోవాలన్నారు. విద్యార్ధుల్లో సృజనను ప్రేరేపించేలా ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ లాంటివి మరిన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. 

రాజతంత్రమే ఆధారం: ఆర్‌ఎన్‌ రవి, జాతీయ భద్రతా ఉప సలహాదారు
బలమైన రాజతంత్రంపైనే దేశ రక్షణ ఆధారపడి ఉంటుందని డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్, జాయింట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. పూర్వీకులు మనకు నేర్పిన రక్షణరంగ తంత్రాలను మరచిపోయి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య ధోరణిలో పనిచేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా దీన్ని సరిచేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌ఎస్‌ హస్భినిస్, డాక్టర్‌ డీబీ షేకత్కర్, మేజర్‌ జనరల్‌ ఏబీ గోర్తీ, సంజయ్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు