ప్రమోషన్లు మాకంటే మాకు

18 Aug, 2017 01:51 IST|Sakshi
ప్రమోషన్లు మాకంటే మాకు

► విద్యాశాఖలో పదోన్నతుల లొల్లి
► పర్యవేక్షణాధికారుల పోస్టుల కోసం వెల్లువెత్తుతున్న డిమాండ్లు


సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో ప్రమోషన్ల లొల్లి మొదలైంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డిప్యూటీ ఈవో), మండల ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(ఎంఈవో) వంటి పర్యవేక్షణాధి కారుల పోస్టులతోపాటు డైట్, బీఎడ్‌ కాలేజీ లెక్చరర్ల వంటి కొలువుల్లో పదోన్నతులను తమకంటే తమకే కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 1998 నుంచి 2005 వరకు ఇచ్చిన పదోన్నతులను రద్దు చేసి, సీనియారిటీ ఆధారంగా పర్యవేక్షణ అధికారి పోస్టులను తమకు కేటాయించాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్‌ చేస్తుండగా, ఏకీకృత సర్వీసు రూల్స్‌ రూపొందించి, సమాన సీనియారిటీ ప్రాతిపదికన ఆ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్‌ టీచర్లు కోరుతున్నారు.

మరోవైపు గిరిజన ప్రాంత టీచర్లు కూడా తమను ఏకీకృత సర్వీసు రూల్స్‌ పరిధిలోకి తెచ్చి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఏపీపీఎస్సీ ద్వారా 1997లో జోనల్‌ కేడర్‌లో స్కూల్‌ అసిస్టెంట్లుగా నియమితులైన టీచర్లు కూడా ఇదే డిమాండ్‌ వినిపిస్తున్నారు. పర్యవేక్షణ అధికారి పోస్టు జోనల్‌ కేడర్‌ కావడం, తాము జోనల్‌ కేడర్‌లోనే నియమితులైనందున సీనియారిటీ ఆధారంగా తమకే ఆ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటున్నారు. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి వారంతా నిజంగా జోనల్‌ కేడర్‌లోనే నియమితులయ్యా రా? అన్న అంశంపై స్పష్టత కోసం ఇటీవల ఏపీపీఎస్సీకి లేఖ రాసి వివరాలు తెప్పించుకుంది. ఏపీపీఎస్సీ కూడా వారంతా జోనల్‌ కేడర్‌లోనే నియమితులైనట్లు చెప్పడంతో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది.

అసలైన అర్హులెవరు: అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతులకు అసలు అర్హులెవరు అన్న అంశం తెరపైకి వచ్చింది. దీనిపై విద్యాశాఖ వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌ రూపకల్పనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినందున తమకే ఎక్కువ ప్రమోషన్లు లభిస్తాయని పంచాయతీరాజ్‌ టీచర్లు ఆనం దంలో మునిగిపోయారు.

ఈలోగా రాష్ట్రపతి ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఎలా ఆమోదం తెలుపుతారని ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఆ కేసు విచారణకు తీసుకుంది. అయితే కొద్దిరోజుల్లోనే ఆ వివాదం పరిష్కారం అవుతుందని, ఆలోగా సర్వీస్‌ రూల్స్‌ను సిద్ధంగా ఉంచేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పర్యవేక్షణ అధికారి పోస్టులు తమకంటే తమకు ఇవ్వా లని ఉద్యోగులు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఇక 1976లోనే తమ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేసినందున పర్యవేక్షణ అధికారితోపాటు లెక్చరర్‌ పోస్టులకు తాము అర్హు లమేనంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు