ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి

12 Dec, 2019 10:11 IST|Sakshi
నిందితుడు వెంకటేశ్వరరావు, చంద్రబాబుతో దిగిన ఫొటోలు చూపుతున్న బాధితులు

నవ్యాంధ్ర ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిపై ఫిర్యాదు

పంజగుట్ట: ఆంధ్రప్రదేశ్‌లోని సినీ రంగంలో అవకాశాలు రావాలంటే తమ నవ్యాంధ్ర ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సభ్యులై ఉండాలని, తనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సన్నిహితుడని ఆయన సూచన మేరకే చాంబర్‌ను స్థాపించినట్టు చెప్పుకోవడమేగాక.. సుమారు 2 వేల మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసి ప్రశ్నించినందుకు తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని బాధితులు వాపోయారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీకటిపల్లి సాగర్, చరణ్‌ ప్రభాకర్, గోవిందరాజు, మహాలక్ష్మి, శాంతిప్రియ తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2016లో సుద్దపల్లి వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఏపీలో కూడా ఫిలిం చాంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పాడన్నారు. దానికి నవ్యాంధ్ర ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా పేరు పెట్టామని ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబుతో దిగిన ఫొటోలు, ఆయనతో మాట్లాడిన వీడియోలు, అతను ఇచ్చిన ప్రకటనలు చూసి సినీ రంగంలో అవకాశాలు దొరుకుతాయన్న ఆశతో తాము సభ్యత్వం కింద రూ.2001, కార్డు పేరుతో రూ.50 వేల నుండి రూ.లక్ష, అవకాశాల కోసమని లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు.

వెంకటేశ్వర్‌రావు శ్రీనగర్‌కాలనీ కవిత అపార్ట్‌మెంట్‌లో కార్యాలయాన్ని తెరిచి ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగించాడన్నారు. కార్డు తీసుకుంటే 10 లక్షల ఆరోగ్య బీమా, చంద్రబాబుతో చెప్పి అమరావతిలో డబుల్‌ బెడ్‌రూం సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికాడన్నారు. సినీనటి కవిత కూడా ఇతడి భాధితురాలే అని, ఆమె కూడా ఇతనిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వర్‌రావు మోసాలను గ్రహించి గుంటూరు, విజయవాడ, తిరుపతి, బంజారాహిల్స్, సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ను కలిసి పూర్తి ఆధారాలతో అతను చేస్తున్న మోసాలగూర్చి వివరించామని, ఆయన వెంటనే స్పందించి అతనిపై కేసు నమోదు చేయించి, కారు సీజ్‌ చేసి, బ్యాంకు అకౌంట్లపై ఆరా తీçస్తున్నారన్నారు. కాగా తనవెనుక పెద్దలు ఉన్నారని భయపెడుతున్నాడరి బాధితులు పేర్కొన్నారు. కాగా గతనెల 16న వెంకటేశ్వర్‌రావు అమీర్‌పేటలో తమకు కనిపించగా అతడిని పంజగుట్ట పోలీసులకు అప్పగించామన్నారు. అప్పటికే ఇతని కోసం నగరంలో వెదుకుతున్న తిరుపతి పోలీసులు వచ్చి అతడిని తిరుపతికి తీసుకువెళ్లి రిమాండ్‌ చేశారన్నారు. కాగా వెంకటేశ్వర్‌రావు బయటకు వచ్చి అతడిపై తాము దాడి చేశామని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టాడని వాపోయారు. అతడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమలా ఇంకెవ్వరూ మోసపోవద్దని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని బాధితులు కోరారు.

మరిన్ని వార్తలు