పింఛన్‌ డబ్బులు కాజేశాడని ఫిర్యాదు

17 Mar, 2019 18:18 IST|Sakshi
బీపీఎంతో గొడవ పడుతున్న గ్రామస్తులు

బజార్‌హత్నూర్‌: మండలంలోని గిర్నూర్‌లో బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ నూర్‌సింగ్‌ పింఛన్‌ డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీవో దుర్గం శంకర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. 15వందల పింఛన్‌కు వెయ్యి రూపాయలు, రెండు నెలలకు సంబంధించిన పింఛన్‌ 2వేలకు వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, బయోమెట్రిక్‌ ద్వారా వచ్చిన ప్లే స్లిప్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండా చించివేస్తున్నాడని, బుక్కుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో ఈవోపీఆర్డీ విజయ్‌భాస్కర్‌రెడ్డిని గ్రామానికి పంపారు.

గ్రామానికి వచ్చి న ఈవోపీఆర్‌డీ బీపీఎంతో మాట్లాడుతున్న సమయంలో వెయ్యి ఇచ్చి 2వేలు ఇచ్చినట్లు రాయడంతో గ్రామస్తులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ జయరాం, ఎస్సై అబ్ధుల్‌బాఖీ సంఘటన స్థాలానికి చేరుకుని పోస్టల్‌కు సంబంధించిన ఎస్పీఎం, మేయిల్‌ గార్డ్‌ అధికారులతో మాట్లాడారు. సోమవారం విచారణ చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణ, ఉప సర్పంచ్‌ వినోద్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, భూపాల్‌రెడ్డి, గ్రామస్తులు కొమ్ము నారాయణ, బాపురావ్, రాములు, సాయికృష్ణ,లక్కం నారాయణ, గవ్వల సాయిచైతన్య పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు