తూచ్‌.. మిత్ర

21 Jan, 2020 10:05 IST|Sakshi

కోచ్‌ మిత్ర యాప్‌కు ఫిర్యాదుల వెల్లువ

స్పందించని రైల్వేశాఖ వివిధ సమస్యలపై 5203 వినతులు

ప్రతి నెలా సగటున 433..

నీళ్లు లేవు, కరెంట్‌ లేదు, బొద్దింకలు, బోలెడు ఎలుకలు

దక్షిణ మధ్య రైల్వేలో ఆన్‌బోర్డు సేవలు డొల్ల

సాక్షి, సిటీబ్యూరో: రైలు ప్రయాణం అంటే ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లడమే కాదు. ఒక మంచి అనుభూతి కూడా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ప్రయాణించే వారు తమ జర్నీ ఆహ్లాదంగా..ఆనందంగా..ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. కానీ, ఇప్పుడు రైలు జర్నీ ‘డర్టీ’గా మారింది. అపరిశుభ్ర వాతావరణం, ఎలుకలు, బొద్దింకలు, కంపుకొట్టే టాయిలెట్లు, నీళ్లు రాని నల్లాలు, మురికిమయమైన దుప్పట్లు, చిరిగిన బెర్త్‌లతో రైలు ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశాలపై ఇప్పుడు రైలు ప్రయాణికులు సీరియస్‌ అవుతున్నారు. పెద్ద ఎత్తున రైల్వే శాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన  సదుపాయాలను అందజేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన‘కోచ్‌మిత్ర’ యాప్‌నకు గతేడాది వివిధ సమస్యలపై ఏకంగా  5203 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిలో మరుగుదొడ్ల అపరిశుభ్రతపైనే 1675 ఫిర్యాదులు అందితే, నీటిసరఫరా లేకపోవడంపైన మరో 1106 మంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓవర్‌నైట్‌ జర్నీ చేసే  ప్రయాణికులు చాలామంది బెడ్‌షీట్స్‌ అపరిశుభ్రంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేటరింగ్‌ సర్వీసులపైనా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. గతంలో రుచి,శుచీ లేని ఆహార పదార్థాలపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి యథావిధిగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఏమిటీ కోచ్‌ మిత్ర...
స్వచ్ఛమైన..పరిశుభ్రమైన రైళ్లలో ప్రయాణ సదుపాయం కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ 2016లో ‘క్లీన్‌మై కోచ్‌’ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బోగీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమే ఈ యాప్‌ లక్ష్యం. ఇందుకోసం ఆన్‌బోర్డు హౌస్‌ కీపింగ్‌ (ఓబీహెచ్‌ఎస్‌) సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించే విధంగా ఈ యాప్‌ను మరింత అభివృద్ధి చేసి ‘కోచ్‌మిత్ర’గా ప్రవేశపెట్టారు. దక్షిణమధ్య రైల్వేలోని 144 రైళ్లలో ప్రస్తుతం ఈ కోచ్‌మిత్ర మొబైల్‌ అప్లికేషన్‌ వినియోగంలో ఉంది. ఈ రైళ్లలోనే 2019లో వివిధ సమస్యలపైన 5203 ఫిర్యాదులు అందాయి. వేలకు వేలు చెల్లించి ఏసీ బోగీల్లో వెళ్లే ప్రయాణికులకు తగిన సేవలు లభించడం లేదు. ఫస్ట్‌ఏసీ బోగీల్లోనే నీళ్లు రావడం లేదని, ఆన్‌బోర్డు హౌస్‌కీపింగ్‌ సకాలంలో స్పందించకపోవడమే ఇందుకు కారణమని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.‘చాలా సార్లు ఏసీలు పనిచేయవు. ఫ్యాన్లు తిరగవు.ఎలక్ట్రికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండరు. ఒకవేళ ఉన్నా పట్టించుకోకుండా పెడచెవిన పెడతారు. టాయిలెట్లు దుర్గంధంతో కంపు కొడ్తాయి. రాత్రి వేళల్లో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుంది’ అని హైదరాబాద్‌ నుంచి  బెంగళూర్‌కు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే ఒక ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశారు.

బెంబేలెత్తిస్తున్న బొద్దింకలు...
 ఏసీ, నాన్‌ ఏసీ బోగీల్లో బొద్దింకలు, ఎలకలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏసీ బోగీల్లో ఎలుకలు తరచుగా విద్యుత్‌ వైర్లను కొరకడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. కోచ్‌లు పరిశుభ్రంగా లేకపోవడంపైనే గతేడాది 876 ఫిర్యాదులు కోచ్‌మిత్రకు అందాయి. ఇక బొద్దింకలు, క్రిమికీటకాలపైన 154  ఫిర్యాదులు వచ్చాయి. యార్డుల్లో రైళ్లు పార్క్‌ చేసినప్పుడు  చెత్తా చెదారంతో పాటు బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. కానీ శుభ్రం చేసేటప్పుడు వీటి గురించి శ్రద్ధ చూపడం లేదు. దీంతో మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. 

యాప్‌ సేవల్లో 10 వేల మంది...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 10 వేల మంది ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లలో, ఆన్‌లైన్‌ ద్వారా కోచ్‌మిత్ర సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కోచ్‌మిత్రకు ఫిర్యాదు అందిన వెంటనే ప్రయాణికుడికి ఒక కోడ్‌ నెంబర్‌ను కేటాయిస్తారు. తరువాత  ఆన్‌బోర్డు హౌస్‌కీపింగ్‌ సిబ్బంది వచ్చి సేవలను అందజేస్తారు. ప్రతి నెలా సగటున 433 ఫిర్యాదులు అందుతున్నాయని, 87 శాతం ఫిర్యాదులను అరగంట వ్యవధిలో పరిష్కరిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే  సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. కోచ్‌మిత్రపైన విస్తృత ప్రచారంచేపట్టినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు