కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

22 May, 2019 02:30 IST|Sakshi

10 వేల మందితో బందోబస్తు 

లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ 

అనుమతి ఉంటేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశం 

లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ జితేందర్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్‌), ఎలక్షన్‌ నోడల్‌ అధికారి జితేందర్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన డీజీపీ కార్యాలయంలో మరో నోడల్‌ అధికారి ఎస్పీ సుమతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జితేందర్‌ మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియను 23వ తేదీన చేపట్టనున్న నేపథ్యంలో బందోబస్తుపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 34,603 పోలింగ్‌ స్టేషన్లలో 18,526 పోలింగ్‌ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించామని చెప్పారు. వీటికి 40 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 10 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌.. 
కౌంటింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్‌ తెలిపారు. కేంద్ర బలగాల పహారా మధ్య ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జనసంచారంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. సరైన అనుమతి లేకుండా కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించడం కుదరదని వెల్లడించారు. ఒకవేళ అనుమతి ఉన్నా.. మొబైల్‌ ఫోన్లు లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద స్థానిక అవసరాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామని.. ప్రతీ కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారి భద్రతా చర్యలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తారని వివరించారు. 

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.. 
ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని జితేందర్‌ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ర్యాలీలు చేపట్టాలనుకున్నవారు పోలీసులను ముందుగా సంప్రదించి, అనుమతి తీసుకుంటే తామే బందోబస్తు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు జితేందర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలోనే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. 
నిజామాబాద్‌లో ఈవీఎం యంత్రాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్‌ వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో నిజామాబాద్‌ ఫలితం మిగిలిన అన్ని స్థానాల కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికితోడు సున్నిత ప్రాంతాల్లో కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేశామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు